TTD: తిరుమలలో మాజీ సీజేఐ ఎన్వీ రమణ శ్రమదానం..!!
తిరుమలలో జరిగిన శుద్ద తిరుమల కార్యక్రమంలో మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఘాట్ రోడ్డులోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. తిరుమల కొండలు పరమ పవిత్రమైనవని చెప్పారు. ఈ ప్రాంతాన్ని ప్రతి ఒక్కరు తమ ఇంట్లో దేవుడి గదిలా భావించి శుభ్రంగా, పవిత్రంగా ఉంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తిరుమల లో శుభ్రత కోసం టీటీడీ సామూహిక శ్రమదాన కార్యక్రమం నిర్వహించింది.
తిరుమలలో సామూహిక శ్రమదానం కార్యక్రమాన్ని మాజీ సీజేఐ ఎన్వీ రమణ ప్రారంభించారు. 700 మందికి పైగా అధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు సెక్టార్ల వారీగా తమకు కేటాయించిన ప్రదేశాల్లో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమలను ప్లాస్టిక్ రహిత ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడానికి టీటీడీ చేస్తున్న కృషిలో ప్రతి భక్తుడు భాగస్వాములు కావాలని కోరారు.

2008లో ఈవో ధర్మారెడ్డిని తమకు ఇలాంటి సేవ చేసే అవకాశం కల్పించాలని కోరినట్లు ఆయన తెలిపారు. భగవంతుడు తనకు ఇన్నాళ్లకు ఆ అవకాశం ఇచ్చారని, ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఈవో తనను ఆహ్వానించారని ఆయన తెలిపారు. టీటీడీ చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో గొప్పదని, ఇందులో పాల్గొంటున్న ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, భక్తులను ఆయన అభినందించారు.
టీటీడీ చేపట్టిన శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రమదానం కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చేసి నిరంతరం కొనసాగించాలని కోరారు. 25 రోజుల క్రితం 1600 మంది పారిశుధ్య కార్మికులు ముందస్తు సమాచారం లేకుండా సమ్మెలోకి వెళ్లారని ఈవో ధర్మారెడ్డి చెప్పారు.
భక్తులకు ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతో తిరుపతితో పాటు చుట్టుపక్కల ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయతీల నుంచి పారిశుధ్య కార్మికులను రప్పించి టీటీడీ అధికారులు ఉద్యోగులు పారిశుద్ధ్య పనులు చేశారన్నారు. ఇదే స్ఫూర్తితో రెండు ఘాట్ రోడ్లు, నడక మార్గాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేయడానికి శనివారం సామూహిక పారిశుధ్య కార్యక్రమం చేపట్టామని ఆయన చెప్పారు.
ఇకపై ప్రతినెల రెండో శనివారం సుందర తిరుమల- శుద్ధ తిరుమల కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. ఆసక్తి ఉన్న అధికారులు, ఉద్యోగులు, భక్తులు, శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా పాల్గొని తిరుమలను పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా ఉంచడానికి కృషి చేయాలని కోరారు. భక్తులెవరూ తిరుమలకు ప్లాస్టిక్ ఉత్పత్తులను తీసుకుని రావద్దని ఈవో ధర్మారెడ్డి కోరారు.












Click it and Unblock the Notifications