మంత్రి పెద్దిరెడ్డిని దెబ్బతీయడానికి 'నల్లారి' వ్యూహం?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించడానికి ముందు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజనతో జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి పోటీచేశారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల నుంచి కాస్తంత పక్కకు జరిగారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మరో దశాబ్దకాలం పాటు భవిష్యత్తు ఉండకపోవచ్చని ఆయన అంచనా. ఇటువంటి సమయంలో తాను పార్టీలో యాక్టివ్ గా ఉండి ప్రత్యర్థులను, శత్రువులను పెంచుకోవడం ఎందుకని భావిస్తున్నారు. . ఇటీవలి కాలంలో ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీని కలిశారు. తర్వాత ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపడతారని వార్తలు వచ్చినప్పటికీ అవి నిజం కాలేదు.

నల్లారికి ఇద్దరు ప్రత్యర్థులు
నల్లారికి చంద్రబాబుతోపాటు పెద్దిరెడ్డి ప్రత్యర్థులుగా ఉండేవారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో తనకు మంత్రి పదవి రాకుండా చేసింది ప్రస్తుత మంతి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని కిరణ్ కు తెలుసు. జగన్ పెద్దిరెడ్డిని దగ్గరకు తీయడంతో వీరిద్దరి మధ్య వైరం ఇంకా పెరిగింది. నల్లారికి మంత్రి పదవి దక్కకుండా జగన్ వెంట నిలిచి పెద్దిరెడ్డి అడ్డుకున్నారనేది బహిరంగ రహస్యం.

చిత్తూరు జిల్లాను శాసించిన నల్లారి కుటుంబం
చిత్తూరు జిల్లా రాజకీయాలను ఒకప్పుడు నల్లారి కుటుంబం శాసించేది. తర్వాత కాలంలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంతో ఆధిపత్య పోరు నడిచేది. వైఎస్ మరణం తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబానిదే పైచేయిగా ఉంది. పెద్దిరెడ్డిని దెబ్బ కొట్టేందుకు నల్లారి తన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డిని టీడీపీలోకి పంపించారని చెబుతుంటారు. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న నల్లారి తనకు, వైఎస్ కు మధ్య భేదాభిప్రాయాలు రావడానికి కారణం ఒక మంత్రి అని వ్యాఖ్యానించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

పెద్దిరెడ్డిని దెబ్బతీయడానికే..
వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డిని దెబ్బతీసేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో తన సోదరుడికి అన్నిరకాలుగా అండదండలందించినప్పటికీ ఓటమిపాలయ్యారు. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గానికి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జిగా కిషోర్ కుమార్ రెడ్డి కొనసాగుతున్నారు.
రానున్న ఎన్నికల్లో సోదరుడిని గెలిపించడానికి ఇప్పటినుంచే తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే కిలికిరిలో తన కుమారుడితో కలిసి పర్యటన చేశారు. ప్రస్తుతం ఉన్న పరిణామాలను, ఎన్నికల సమయంలో ఉండే వాతావరణాన్ని అంచనా వేసుకొని నల్లారి అడుగులు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications