జగన్ ను బెదిరిస్తున్న వంగలపూడి అనిత!!
జగన్‌పై హోం మంత్రి అనిత వ్యాఖ్యలు అనుచితం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు రివర్స్ అటాక్ చేశారు. హోం మంత్రి అన్న విషయాన్ని మరచిన అనిత ఇలా మాట్లాడటం దారుణం అన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని పేర్కొన్నారు.
జగన్ ను హోం మంత్రి బెదిరిస్తున్నారా?
హోం మంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి జగన్ ను మాజీ ముఖ్యమంత్రి అనడం ఇష్టం లేక.. పులివెందుల ఎమ్మెల్యే అని సంబోధించడం దారుణమన్నారు. రాష్ట్రంలో 36 హత్యలు ఎక్కడ జరిగాయో లిస్ట్ ఇవ్వకపోతే కేసు పెడతామని బెదిరించడం సరికాదని ఆయన తేల్చి చెప్పారు. ఇంకా బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి, ఒక మహిళ అయిన అనిత.. మాజీ సీఎం వైయస్ జగన్‌ను ఉద్దేశించి, మైండ్ దొబ్బిందా అనడం హేయమని అన్నారు.

అనిత మైండ్ సరిగ్గాలేదేమో ?
మంత్రి అనిత మాటలు చూస్తుంటే.. అసలు ఆమెకే మైండ్ సరిగ్గా లేదనిపిస్తోందని, తన పనితీరు మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని, ఏకంగా సీఎం చంద్రబాబు చెప్పడంతో, ఆమెకు దిక్కు తోచడం లేదని అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగా లేవని మీడియా ప్రశ్నిస్తే.. దేనికైనా టైమ్ రావాలని, తాను లాఠీ పట్టుకుని వెళ్లాలా? అని తిరిగి ప్రశ్నించడం హోం మంత్రికి ఎంత వరకు సబబు అని నిలదీశారు.
పల్నాడు హత్య ఘటనపై ఆందోళన
పల్నాడు వినుకొండలో వైసీపీ కార్యకర్తను నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపితే, ఆ ఘటనపైనా దుష్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆక్షేపించారు. అది రాజకీయ హత్య కాదని.. ఇద్దరు మిత్రుల మధ్య వివాదాలే కారణమంటూ ప్రచారం చేస్తూ.. కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ ఘటనలో మా పార్టీదే బాధ్యత అనడం అత్యంత హేయమని తేల్చి చెప్పారు.

ప్రతి రాజకీయ హత్య వివరాలను కచ్చితంగా బయటపెడతాం
నంద్యాల ముచ్చుమర్రి ఘటనలో బాలిక శవం ఆచూకీ ఇంకా కనిపెట్టలేదని, అనుమానితుడు గాయాలతో మృతి చెందటం ప్రభుత్వ హత్యని ఆరోపించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరవాత జరిగిన ప్రతి రాజకీయ హత్య వివరాలను కచ్చితంగా బయటపెడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విఫలమైన లా అండ్ ఆర్డర్ గురించి మాత్రం కచ్చితంగా రోడ్డు మీదకు వచ్చి నిలదీస్తామని ప్రకటించారు.
శాంతి భద్రతల శ్వేత పత్రం రిలీజ్ వాయిదా అందుకే
జగన్ ను అప్రతిష్ట పాలు చేయటమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అందుకే శ్వేతపత్రాల పేరుతో అసత్యాల ప్రచారం చేస్తున్నారని, 45 రోజులుగా రాష్ట్రంలో దారుణ, అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. యథేచ్ఛగా హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసం వంటి ఘటనలకు పాల్పడుతున్నారన్నారు. టీడీపీ పాలనలో ప్రజలలో అలజడి, అశాంతి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అందుకే శాంతి భద్రతల శ్వేత పత్రం రిలీజ్ వాయిదా వేశారన్నారు.












Click it and Unblock the Notifications