రాసుకోండి.. వాళ్లకి 2024 తర్వాత నిద్రలేని రాత్రులే?
రాసుకోండి.. నెల్లూరు నుంచే తాను పోటీచేస్తున్నానని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. టీ దుకాణాల దగ్గర మాట్లాడేవారికి కూడా చెబుతున్నానని.. అనిల్ అనేవాడు నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తాడని, ఇది తథ్యం అన్నారు. అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గీసిన గీత దాటడు అని మరోసారి చెబుతున్నానని, అనిల్ కుమార్ యాదవ్ అనే వాడు ఎవరికైనా తల వంచుతాడు అని అంటే అది కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డికి ముందు తప్పితే ఇంకొకరి ముందు తల వంచే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు.
కొంతమంది శునకానందం పొందుతున్నారని, కొన్నిరోజులు వారిని అలాగే ఆనందాన్ని పొందనివ్వాలని, ప్రశాంతంగా నిద్రపోనివ్వాలని సూచించారు. అనిల్ కుమార్ యాదవ్ కు టికెట్ కాకపోతే 2024లో పోటీచేసిన తర్వాత వారంతా నిద్రలేని రాత్రులు గడపాలన్నారు. ఈ నాలుగు రోజులు ప్రశాంతంగా ఉండనిస్తానన్నారు. తాను నెల్లూరు నగరం నుంచే పోటీచేస్తానని, జీవితంలో దిగజారి బతికినా ఓడిపోయినట్లేనన్నారు. రాజకీయాలు ఉంటాయి.. పోతాయని.. కానీ చచ్చినా, బతికినా సింహంలాగే ఉంటానన్నారు. ఎంతమంది తనకు వ్యతిరేకంగా వచ్చి పర్వాలేదని, తట్టుకునే శక్తి తనకుందని, తనను ఇబ్బంది పెడుతున్నారని కాళ్లు మొక్కే పని ఉండదన్నారు. శునకానందం పొందేవారందరికీ తన సమాధానం ఇదేనన్నారు.

నెల్లూరు నగరంలో రాజకీయాలు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతున్నాయి. మంత్రి పదవి పోయిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ పనైపోయిందని, వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వరంటూ ఆయన ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. దీనిపై గతంలో రెండుసార్లు పై తరహాలోనే మాట్లాడారు. వైఎస్ జగన్ అనిల్ ను దూరం పెడుతున్నారని, ఇటీవలే సీటు విషయమై గ్యారంటీ కూడా ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. దీంతో అనిల్ కుమార్ యాదవ్ ఎవరిపేర్లు ప్రస్తావించకుండా తనకు వ్యతిరేకంగా వ్యహరించేవారిని ఘాటుగా విమర్శిస్తున్నారు.