చంద్రబాబు, వెంకయ్యలను ఏకేసిన మాజీ ఎంపీ ఉండవల్లి..!
హైదరాబాద్: ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంటులో పాస్ అయినప్పటి నుంచి సీఎం చంద్రబాబు 'సమన్యాయం, సమన్యాయం' అంటున్నారని, అసలు సమన్యాయం అంటే ఏమిటి? చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు.
హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం పూర్తిగా లోటు బడ్జెట్ లో కూరుకుపోయిందన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా రాజ్యసభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, తక్షణం రూ. 10 వేల కోట్లు విడుదల చేయాలని అడిగితే, అప్పటి కేంద్ర మంత్రి రాష్ట్రం ఏర్పడకుండా ఎలా ఇస్తామని ప్రశ్నించారు.
మేము అధికారంలోకి రాగానే విడుదల చేస్తామని చెప్పిన వెంకయ్యనాయుడు, తరువాత ముఖం చాటేశారని తెలిపారు. తక్షణ సాయంగా కేంద్రం 18 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని చంద్రబాబు అడిగితే, విభజన చట్టంలో పొందుపరచినవి మినహా అదనంగా పది పైసలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

రాష్ట్ర పునర్విభజన తరువాత బీజేపీ నేతలు చెబుతూ పదేళ్ల పాటు ట్యాక్సులు ఉండవని, పరిశ్రమలు వచ్చేందుకు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పారు. ఉమ్మడి రాజధానిలో పదేళ్లు సమాన హక్కులుంటాయని చెప్పిన వారు ఏమీ ఇవ్వకుండా నీతి ఆయోగ్, 14వ ఆర్థిక సంఘం పేరు చెప్పి తప్పించుకుంటున్నారన్నారు.
ప్యాకేజీకి, ప్రత్యేకహోదాకు సంబంధం లేదని చెప్పిన ఆయన ప్రత్యేకహోదా వేరు, ప్యాకేజీ వేరని స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా అనేది ట్యాక్స్‌లు, ఇతరత్రా అంశాల్లో రాయితీ వెసులుబాటు కల్పిస్తే, ప్యాకేజీ మౌలిక సదుపాయాలు సమకూర్చుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు.
ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును తలుపులు మూసేసి లోక్‌సభలో పాస్ చేసినట్టు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడడం ఆశ్చర్యం కలిగించిందని ఆయన విమర్శించారు. బీజేపీ మద్దతు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతు కోయడం సాధ్యమయ్యేదా? అని ఆయన ప్రశ్నించారు.
అప్పటి సభలో కాంగ్రెస్ తరపున జైపాల్ రెడ్డి, బీజేపీ తరపున సుష్మాస్వరాజ్ మాత్రమే మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. రాజ్యసభలో పదేళ్ల స్పెషల్ స్టేటస్ కావాలని డిమాండ్ చేసింది మాత్రం వెంకయ్యనాయుడేనని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications