
చిరంజీవి బర్త్ డే వేడుకల్లో కొడాలి నాని-అభిమానులకు కేక్ తినిపించి సంబరాలు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టాలీవుడ్ పరిశ్రమ తరఫున పలు సమస్యల్ని సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న మెగాస్టార్ చిరంజీవిని వైసీపీ ఓన్ చేసుకున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే పలుమార్లు సీఎం జగన్ ను కలిసేందుకు తాడేపల్లి వచ్చిన చిరంజీవిపై వైసీపీ వర్గాలు సాఫ్ట్ కార్నర్ తోనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇవాళ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని సంబరాలు చేసుకున్నారు.
Recommended Video
వైసీపీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఇవాళ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. తన నియోజకవర్గంలో చిరంజీవి అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా తానే స్వయంగా కేక్ కట్ చేసి మరీ అభిమానులకు తినిపించారు. దీంతో అభిమానులు కూడా సంతోషంగా ఫీలయ్యారు. ఓ అభిమానికి చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన శాలువా కప్పి సన్మానించారు కూడా. దీంతో కొడాలి నాని సంబరాలు చర్చనీయాంశమయ్యాయి.

తాజాగా కొడాలికి సన్నిహితంగా ఉండే జూనియర్ ఎన్టీఆర్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కావడంపై స్పందిస్తూ బీజేపీకి ఆయన అవసరం ఉందన్నారు. అలాగే చిరంజీవి-జగన్ మధ్య సోదర సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లోనూ కొడాలి పాల్గొన్నట్లు తెలుస్తోంది. కొడాలి గెలిచిన గుడివాడలోనూ చిరంజీవికి భారీగా అభిమానులు ఉన్నారు. దీంతో వారికి మరింత దగ్గరయ్యేందుకు కొడాలి నాని ఇలా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.