పుట్టపర్తిలో ఎట్టకేలకు నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత
అనంతపురం: అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఇటీవల దొంగ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను పుట్టపర్తి పోలీసులు అరెస్టు చేశారు. డిఎస్‌పి శ్రీనివాసులు, సిఐ వేణుగోపాల్, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌లు మంగళవారం మీడియా సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. ముఠాను మీడియా ముందు ప్రవేశపెట్టారు.
పుట్టపర్తిలో దొంగనోట్లు చెలామణిచేస్తూ సంచలనం రేకెత్తించిన ముఠాపై గట్టి నిఘా ఏర్పాటుచేసి వారిని అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్‌పి శ్రీనివాసులు తెలిపారు. గత నెల 28న స్థానిక సాయి సూపర్‌బజార్ మార్కెట్‌లో 11 రూ. 100ల నోట్లు చెలామణి చేస్తున్న కొందరు వ్యక్తులపై నిఘా వుంచి వారిపై దృష్టిసారించారు.

పుట్టపర్తి వివేకానందనగర్‌కు చెందిన ఉప్పలోల్ల ఆనంద్, వీరజిన్నయ్యపల్లి గ్రామానికి చెందిన గోవింద్, రంగప్ప, హరిబాబులు, గువ్వలగుట్టపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు ఐదుమందిని పుట్టపర్తి సమీపాన కర్ణాటకనాగేపల్లి వద్ద అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్‌పి తెలిపారు. వీరిని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిపారు. ఆనంద్, గోవింద్‌ల వద్ద రెండు కలర్ ప్రింటర్లు, ముద్రణకు వాడే ప్రతులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
దాదాపు రూ. 32,500 మొత్తాన్ని 275 రూ.100ల నోట్లు, 103 రూ.50ల నోట్లను వారి వద్ద నుండి స్వాధీనపరుచుకున్నట్లు ఆయన తెలిపారు. పుట్టపర్తి కేంద్రంగా మార్కెట్లు, షాపులు, సూపర్‌మార్కెట్లు పరిసర ప్రాంతాల్లో దొంగనోట్లను చెలామణి చేసినట్లు వారు అంగీకరించారన్నారు. కేసు నమోదు చేసి రిమాండుకు పంపనున్నట్లు డిఎస్‌పి తెలిపారు.












Click it and Unblock the Notifications