కుక్క పిల్లకు ఉరేసి, వారు ఆత్మహత్య చేసుకున్నారు
విజయవాడ: ప్రకాశం జిల్లాలోని వేటపాలెం మండలం కొత్తపేటలో విషాద సంఘటన చోటు చేసుకుంది. తన భర్తను పోలీసులు అరెస్టు చేశారని మనస్తాపం చెందిన ఓ భార్య తన కూతురితో పాటు ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు తనకు ఇష్టమైన పెంపుడు కుక్కను కూడా ఉరేసి చంపారు.
ఈ సంఘటన కొత్తపేటలో సంచలనం సృష్టించింది. కుక్కతోపాటు తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోతే కుక్క పిల్ల ఒంటరిది అయిపోతుందని భావించి, ఎంతో ముద్గుగా పెంచుకున్న కుక్కపిల్లకు కూడా ఉరివేసినట్లు తెలుస్తోంది.

స్వైన్ ఫ్లూతో వ్యక్తి మృతి
నెల్లూరు జిల్లాలోని కోట మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన గోపాల్ అనే 46 ఏళ్ల వ్యక్తి స్వైన్‌ఫ్లూతో మరణించాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం చెన్నై ఆసుపత్రికి వెళ్లిన గోపాల్ అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. ఈ సంఘటనతో మృతుడి కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.
ఇలా స్వైన్‌ఫ్లూతో మరణించిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. జిల్లాలో స్వైన్‌ఫ్లూ ప్రభావం లేదని జిల్లా వైద్యాధికారులు అంటున్నా ఈ వ్యాధితో ముగ్గురు మరణించడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
శేషాచలం అడవుల్లో కార్చిచ్చు
చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవుల్లో కార్చిచ్చు రాజుకుంది. కరకంబాడి గ్రామం వైపు మంటలు వ్యాపిస్తున్నాయి. తరచూ శేషాచల అడవుల్లో కార్చిచ్చు రాజుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంలో అటవీశాఖాధికారులు విఫలమయ్యారు.
దీంతో విలువైన అడవులు తరచూ తగులబడిపోతున్నాయి. అడవుల్లో రాజుకుంటున్న మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపకశాఖాదికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని స్థానికులంటున్నారు.












Click it and Unblock the Notifications