కోటి రూపాయలా, ఎక్కడా లేదు: కెసిఆర్ సాగుపై బాబు
హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులంతా తమ భూముల్ని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావుకు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన శనివారం అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్‌కు రైతులందరి భూములు ఇచ్చి ఎకరాకు రూ. 5 లక్షల ఆదాయం తీసుకోవాలని చెప్పారు.
కెసిఆర్ తన పద్ధతిలో వ్యవసాయం చేసి ఎకరాకు రూ. 5 లక్షల చొప్పున రైతులకిచ్చి మిగితా 95 లక్షల రూపాయలు తీసుకోవాలని అన్నారు. ఈ విధంగా చేస్తే రాష్ట్రంలోని రైతులు బాగుపడతారని చెప్పారు. కెసిఆర్ చెప్పినంత మాత్రాన ఎకరాకు కోటి రూపాయల ఆదాయం వస్తుందని ఏ మాత్రం ఆలోచించకుండా రాసేస్తారా? అని మీడియా ప్రతినిధులను ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ ప్రాంతంలో రైతులంతా గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. కెసిఆర్ మాత్రం లాభపడ్డానని చెప్పుకోవడం హాస్యాస్పదం అన్నారు. ఇదంతా నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చుకునే ప్రక్రియలో భాగమేనని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
ప్రపంచంలో ఎక్కడైనా ఎకరానికి కోటి రూపాయల ఆదాయం వస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. అమెరికా, ఆస్ట్రేలియాలో వ్యవసాయం చేసినా అంత రాదని తెలిపారు. ఎక్కడెక్కడో సంపాదించిన సొమ్మునంతా అక్కడ పోసి ఏరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ తన ఫాంహౌజ్‌లో చేస్తోంది వ్యవసాయం కాదని, అవినీతి సాగేనని ఆరోపించారు.












Click it and Unblock the Notifications