TDP Vs YCP: ఉద్రిక్తత.. రాళ్లదాడి
చిత్తూరు జిల్లా సోమల మండలంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోమల మండలంలోని పెద్ద ఉప్పరపల్లి, నంజంపేట తదితర గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు చల్లా వెళ్తుండగా సోమల దళితవాడ వద్ద వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ఆ తర్వాత రామచంద్రారెడ్డి నంజంపేటకు వెళ్లారు. అక్కడ టీడీపీ-వైసీపీ శ్రేణుల మద్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు రాళ్లతో దాడి చేసుకున్నారు. టీడీపీ నేతలకు చెందిన పలు వాహనాల అద్దాల ధ్వంసమయ్యాయి. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ నాయకులు కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' కార్యక్రమం సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తుండగా, అసలు కార్యక్రమే జరగకుండా చూసేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ఎక్కడ జరిగినా ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది.

అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా బాదుడే బాదుడుతోపాటు 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' కార్యక్రమాలను టీడీపీ రూపొందించింది. తాను రూపొందిస్తున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని భావిస్తున్న టీడీపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ సంభవిస్తోంది.












Click it and Unblock the Notifications