విశాఖలో ఆరని మంటలు: స్పాట్‌లో 40 ఫైరింజన్లు, నష్టం 200 కోట్లు పైమాటే..!
అమరావతి: విశాఖపట్నంలోని దువ్వాడ ఎస్‌ఈజెడ్‌లోని బయోమాక్స్ కంపెనీలో సంభవించిన అగ్ని ప్రమాదంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. రాత్రి నుంచి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నా మంటలను అధికారులు ఆర్పలేకపోతున్నారు.
మంటలను ఆర్పేందుకు 40 ఫైరింజన్లతో 14 గంటలకు పైగా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. బయోమ్యాక్స్ కంపెనీలోని 18 ముడి చమురు ఆయిల్ ట్యాంకర్లలో 12 ట్యాంకర్లు తగలబడుతున్నాయి. వీటిల్లో 6 ట్యాంకర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో నేవీ రంగంలోకి దిగింది.
గగనతలం నుంచి నేవీ హెలికాప్టర్లతో మంటలను ఆర్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మంటలు అదుపులోకి రావడానికి మరో పది గంటలు పడుతుందని అధికారులు చెప్పుతున్నారు. ఈ భారీ ప్రమాదంలో సుమారు 200 కోట్ల మేర ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా.

మరింత ఆస్తినష్టం జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బయోమ్యాక్స్ కంపెనీలో ఎక్కువ శాతం ఇంజిన్లతో పని జరుగుతుండటంతో ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే... సిబ్బందిలో ఒకరు గల్లంతైనట్లు తెలుస్తోంది. మరోవైపు 100 అడుగులకుపైగా ఎత్తులో ఎగసిపడిన మంటలు చుట్టుపక్కల ప్రజలను భయభ్రాంతులకు గురిస్తున్నాయి.
బయో డీజిల్ ట్యాంకర్లు పేలడంతో పొగ కాలుష్యం ఆ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు విశాఖ నగరాన్ని కమ్మేసింది. అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం ఆరా తీశారు. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో కంపెనీలో ఆయిల్ రిఫైనరీ ట్యాంకర్లు పేలి అగ్ని ప్రమాదం సంభవించింది.
వెంటనే స్పందించిన అగ్నిమాపక శాఖ ఐదు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. మంటలు అదుపులోకి రాకపోగా రాత్రి పది గంటల సమయంలో ఐదు ట్యాంకులు పేలిపోయాయి. దీంతో ఫోమ్ ద్వారా మంటలను ఆర్పేందుకు విశాఖ స్టీల్‌ప్లాంటు నుంచి రెండు ఫోమ్ ఫైరింజన్లను రప్పించారు.
ప్లాంట్‌లో మొత్తం 18 ట్యాంకులు ఉండగా 12 ట్యాంకులకు మంటలు వ్యాపించాయి. అర్ధరాత్రి వరకు కూడా మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. మిగతా ఆరు ట్యాంకులను సురక్షితంగా ప్రాంతానికి తరలించారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనా స్ధలాన్ని హోంమంత్రి చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు.
పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్, ఫైర్ సర్వీసెస్ డీజీ, నౌకాదళ అధికారులతో మాట్లాడారు. కంపెనీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రులు సూచించారు.
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనికి విద్యుత షార్ట్ సర్క్యూట్ కారణమని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications