తొలి ముద్దాయి కెసిఆర్: పొన్నాల, నెరవేరుస్తాం: గౌడ్
హైదరాబాద్: తెలంగాణ రైతుల ఆత్మహత్యల విషయంలో తొలి ముద్దాయి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావేనని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. విద్యుత్తు సమస్యను పరిష్కరించడంలో విఫలమైన కెసిఆర్ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నిందించి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన శనివారం మీడియా సమావేశంలో అన్నారు.
తెలంగాణలో విద్యుత్ కొరతకు కేసీఆరే కారణమని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. కేసీఆర్ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు తమపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పదేళ్లు నిరాటంకంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే అని పొన్నాల చెప్పారు.

ఆ బాధ్యతను కొనసాగించాల్సిన ముఖ్యమంత్రి అప్రధాన్యమైన అంశాలకు పెద్దపీట వేస్తూ కాలం గడుపుతున్నారని పొన్నాల మండిపడ్డారు. కెసిఆర్‌ది అసమర్థ ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు. విద్యుత్తు సమస్యను కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్లకుండా రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన అన్నారు. కెసిఆర్‌ను సమర్థించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారంపై పార్టీలో చర్చిస్తామని ఆయన చెప్పారు. గాంధీ కుటుంబేతరులు పార్టీ పగ్గాలు చేపట్టవచ్చునని చిదంబరం చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించబోనని ఆయన అన్నారు.
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంపై, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంపై శానసశభ, మండలి సమావేశాల్లో చర్చించనున్నట్లు తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ అన్నారు. శనివారంనాడు ఆయన నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో బోనాల మహోత్సవానికి హాజరయ్యారు. ఆయనతో పాటు భువనగిరి ఎంపి బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శాఖలవారీగా అవసరాలకు అనుగుణంగా నిధుల కేటాయింపు జరుగుతుందని స్వామి గౌడ్ చెప్పారు. చెరువులు, కుంటల పునరుద్ధరణ, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన మంచినీరు, ప్రతి బిడ్డకూ నాణ్యమైన విద్య, ప్రతి మహిళకు గౌరవం లభించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు.
శాసనసమండలి సమావేశాల్లో ప్రతి సభ్యుడికీ మాట్లాడే అవకాశం ఇస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి సూచనలు చేయడానికి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సభ్యులకు సూచించారు.












Click it and Unblock the Notifications