అమెజాన్ డాటా సెంటర్‌పై భీకర దాడులు! ఇదే యుద్ధం..
గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలుముకున్నాయి. అమెరికా - ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా అగ్నిగుండంలా మారింది. ఇరు దేశాలు పరస్పరం క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతుండటంతో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు ఇరాన్ సైన్యం భంగం కలిగిస్తోందనే నెపంతో అమెరికా దళాలు ఇరాన్ లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపించాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన టెహ్రాన్.. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక వసతులే లక్ష్యంగా భీకర వ్యూహంతో ముందుకు సాగుతోంది.
ఆపరేషన్ నాసర్-2: జార్డన్‌లో విమానాలు, రాడార్లు ధ్వంసం!
అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) "ఆపరేషన్ నాసర్-2" పేరుతో విరుచుకుపడింది. జార్డన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడిన ఇరాన్ వైమానిక దళం.. అక్కడి మిస్సైల్ కంట్రోల్ రాడార్ వ్యవస్థను, షెల్టర్‌లో ఉన్న ఎఫ్-15 యుద్ధ విమానాన్ని పూర్తిగా ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. అంతేకాకుండా, రుక్బాన్ ప్రాంతంలో ఉన్న అమెరికా మిలిటరీ కాంపౌండ్‌పై దాడి చేసి పలువురు అమెరికన్ సైనికులను మట్టుబెట్టినట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది.

బహ్రెయిన్‌లో అమెజాన్ డాటా సెంటర్‌పై క్రూయిజ్ మిస్సైళ్లు!
ఈ యుద్ధంలో ఇరాన్ కేవలం సైనిక స్థావరాలనే కాకుండా వ్యాపార, సాంకేతిక మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకుంది. బహ్రెయిన్‌లో ఉన్న ప్రముఖ అమెరికన్ ఐటీ దిగ్గజం 'అమెజాన్‌కు చెందిన ప్రధాన డాటా సెంటర్‌పై ఇరాన్ ఆర్మీ పలు క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసి దాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపింది. తమ పౌర నిర్మాణాలపై అమెరికా చేసిన దాడికి నిరసనగానే ఈ చర్యకు దిగినట్లు ఇరాన్ ఆర్మీ ప్రకటించింది. అయితే ఈ దాడిపై అమెజాన్ కానీ, బహ్రెయిన్ ప్రభుత్వం కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
కువైట్‌లోనూ క్షిపణుల మోత.. రంగంలోకి డ్రోన్లు!
మరోవైపు ఇరాన్ సైన్యం "ఆపరేషన్ లైట్నింగ్" ద్వారా కువైట్‌లోని అమెరికా మిలిటరీ క్యాంపులపై డ్రోన్లు, ఉపరితలం నుంచి ఉపరిలానికి ప్రయోగించే క్షిపణులతో విరుచుకుపడింది. అరిఫ్జాన్ బేస్, అహ్మద్ అల్-జాబెర్ ఎయిర్ బేస్ లలో ఉన్న పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ హబ్‌లు, హెచ్‌ఐఎమ్‌ఎఆర్‌ఎస్ (HIMARS) మిస్సైల్ లాంచర్లను నాశనం చేసినట్లు ప్రకటించింది. అలీ అల్-సలేమ్ ఎయిర్ బేస్‌లోని ఎంక్యు-9 డ్రోన్ హ్యాంగర్‌పై దాడి చేసి పలు డ్రోన్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.
ముదిరుతున్న పోరు.. సంపూర్ణ యుద్ధమే!
అమెరికా తమ సైనిక శక్తులను దెబ్బతీయడమే లక్ష్యంగా సరికొత్త దాడులు మొదలుపెట్టినట్లు ప్రకటించగా, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని అమెరికాతో "పూర్తి స్థాయి యుద్ధం"గా అభివర్ణించారు. మధ్యవర్తుల ద్వారా దౌత్యపరమైన సంప్రదింపులు జరుగుతున్నప్పటికీ, గల్ఫ్ ప్రాంతం నుండి అమెరికా సైన్యం పూర్తిగా ఖాళీ చేసి వెళ్లేవరకు తమ పోరాటం ఆగదని ఇరాన్ స్పష్టం చేయడంతో ప్రాంతీయ భద్రత తీవ్ర ప్రమాదంలో పడింది.












Click it and Unblock the Notifications