వాకింగ్ - జాగింగ్: ఎవరికి ఏది మంచిది..!!
ఆరోగ్యకరమైన జీవనశైలి అందరికీ అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం అవసరం. రోజూ ఎంతో కొంత శారీరక శ్రమ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాయామం కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాక మానసిక ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. వారంలో కనీసం 5 రోజులు రోజుకు 30 నిమిషాల పాటు వ్యాయామం అవసరమని పరిశోధనలు తేల్చాయి. అయితే, వాకింగ్.. జాగింగ్ ఈ రెండింట్లో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందనేది కొందరిలో సందేహం. దీని పైన నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
అన్ని వయసుల్లోనూ ఎక్కువ శాతం మంది చేసే వ్యాయామాల్లో వాకింగ్ ప్రధమ స్థానంలో ఉంది. అదే విధంగా యుక్త వయసులో ఉన్న వారు జాగింగ్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. జాగింగ్ అంటే కాస్త వేగంగా వాకింగ్ చేయడం. రన్నింగ్ కన్నా కాస్త తక్కువ స్పీడ్‌తో పరుగెత్తడం. రెండూ మంచి వ్యాయామాలే. వాకింగ్ కన్నా జాగింగ్ చేస్తేనే ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి. దీంతో బరువు త్వరగా తగ్గుతారు. గుండెకు చక్కని వ్యాయామంగా నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా వాకింగ్ చేస్తే 30 నిమిషాలకు 100కు పైగా క్యాలరీలు ఖర్చు అవుతాయి. కానీ జాగింగ్ చేస్తే 30 నిమిషాలకు 200 కు పైగా క్యాలరీలను ఖర్చు చేయవచ్చని పరిశోధనల్లో తేలింది. 30 నిమిషాల వాకింగ్‌కు బదులుగా 15 నిమిషాల జాగింగ్ చేస్తే చాలని డైటీషియన్లు సూచిస్తున్నారు.

ఆరోగ్య పరమైన ప్రయోజనాలు
ఆరోగ్యంగా.. ఫిట్‌గా ఉండాలనుకునేవారు 15 నిమిషాల పాటు జాగింగ్ చేస్తే సరిపోతుంది. కాగా, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు జాగింగ్ చేయకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీరు 30 నిమిషాల పాటు తేలికపాటి వాకింగ్ చేయాలి. వాకింగ్ చేయటం ద్వారా గుండెకు చక్కని వ్యాయామం జరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ వంటివి రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. అయితే వాకింగ్ లేదా జాగింగ్ ఏది చేసినా ఎవరి సౌకర్యానికి తగినట్లు వారు చేయవచ్చు. ఈ రెండింటి వల్ల షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గడమే కాదు, అధిక బరువును తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అదే విధంగా బరువు నియంత్రణలో ఉంటుంది. హైబీపీ తగ్గుతుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications