కూర రాజన్న సహా ఐదుగురు నక్సల్స్ అరెస్టు
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఐదుగురు నక్సలైట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో సిపిఐ (ఎంఎల్) జనశక్తి అగ్రనేత కూర రాజన్న ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆయనతో పాటు మరో నలుగురిని గత అర్థరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. రహస్య ప్రాంతంలో వారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలోని ఓ గ్రామంలో కూరరాజన్న మరో నలుగురు జనశక్తి సానుభూతిపరులతో కలిసి సమావేశం నిర్వహిస్తున్నాడన్న సమాచారంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందిన కూరరాజన్న సీపీఐఎమ్‌ఎల్ జనశక్తిలో సీనియర్ నేతగా ఉన్నాడు. జిల్లాలో జనశక్తి ఎదుగుదలలో రాజన్న కీలక పాత్ర పోషించాడు.

కూర రాజన్నతో పోలీసుల అదుపులో ఉన్న మరో నలుగురిలో జనశక్తిలో కీలకమైన వ్యక్తిగా పేరొందిన పోతన ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల బనగానపల్లిలో జనశక్తి నక్సల్స్‌కు పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పోతన హస్తం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
మిగిలిన ముగ్గురు జనశక్తి సానుభూతిపరులుగా తెలుస్తోంది. బనగానపల్లి వద్ద జరిగిన ఎదురుకాల్పుల నేపథ్యంలో పోలీసులు జనశక్తి కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈనేపథ్యంలోనే కరూలులోని ఓ గ్రామంలో సమావేశమైన సీపీఐఎమ్‌ఎల్ జనశక్తికి చెందిన ఐదుగురు నక్సల్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications