బాబు షాక్: తలసాని, రేవంత్‌సహా 5గురు తెరాస వైపు?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సనత్ నగర్ శాసన సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర సమితి వైపు చూస్తున్నారా? అంటే కావొచ్చుననే ప్రచారం సాగుతోంది. తెలంగాణలో టీడీపీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఐదుగురు తెరాస వైపు చూస్తున్నారట! తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే భావనలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారట.
తెలంగాణలో టీడీపీ పైన ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అభిప్రాయపడుతున్నారట. ఈ కారణంగా తెరాస వైపు మొగ్గు చూపడమే మంచిదని భావిస్తున్నారట. మరికొద్ది రోజుల్లో రానున్న శ్రావణ మాసంలో తెరాసలో చేరాలని తలసాని సహా ఐదుగురు ఎమ్మెల్యేలు భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది.

తలసానితో పాటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిలు తెరాసలో చేరాలని భావిస్తున్నారట. వీరితో తెరాస నేత, మంత్రి కేటీఆర్సంప్రదింపులు జరిపారట కూడా. అయితే, ఈ ప్రచారాన్ని రేవంత్ రెడ్డి సహా పలువురు కొట్టి పారేస్తున్నారట. రేవంత్ రెడ్డి వంటి నేత తెరాసలోకి వెళ్లే అవకాశం లేదని పలువురు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వారి చేరిక ఊహాగానాలు కరెక్టా కాదా అనే చర్చ సాగుతోంది.
కాగా, విద్యుత్‌కు సంబంధించి పీపీఏలు, పోలవరం ప్రాజెక్టు, గవర్నర్‌కు ప్రత్యేక అధికారాల విషయంలో టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు నేపథ్యంలో తెరాసలోకి చేరడమే మంచిదని భావిస్తున్నారట. కొద్ది రోజుల క్రితం తుమ్మల నాగేశ్వర రావు కూడా తెరాసలో చేరుతారని ప్రచారం సాగింది. ఇది కూడా అలాంటి ప్రచారమే కావొచ్చుననే వారు లేకపోలేదు.
మరోవైపు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కొందరు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు గత రెండు రోజులుగా కొత్తగూడెంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే వెంకటరావును వీరు కలిసినట్లు ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications