మండలి రద్దు ఎంతవరకొచ్చింది? మరి సెలెక్ట్ కమిటీల సంగతేంటి? కొనసాగుతోన్న ట్విస్టులు..
ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన జగన్ సర్కారు.. ఆ తీర్మానానికి పార్లమెంట్ ఆమోదం కోసం కేంద్రానికి కూడా పంపింది.. పార్లమెంట్ ఆమోదం పొందేదాకా మండలి కొనసాగుతుందని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు.. అయితే ఆమేరకు వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై సెలెక్ట్ కమిటీల ఏర్పాటు మాత్రం ఇంకా ముందుకు సాగకపోవడం మరింత గందరగోళానికి దారితీస్తోంది..

రెండు కమిటీలు.. విధివిధానాలు..
వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై వేటికవే విడివిడిగా సెలెక్ట్ కమిటీలు ఏర్పాటు చేయాలని, వాటిని మండలిలో ప్రవేశపెట్టిన మంత్రులే కమిటీలకు చైర్మన్లుగా ఉంటారని, మొత్తం తొమ్మిది మంది ఉండే కమిటీలో ఐదుగురు టీడీపీ సభ్యులకు చోటు కల్పించాలని, పాటించాల్సిన విధివిధానాలను కూడా సూచింస్తూ మండలి చైర్మన్ షరీఫ్ లేఖలు రాసినట్లు ఐదు రోజుల కిందటే వార్తలు వచ్చాయి.

అసెంబ్లీ వర్గాల భిన్నవాదన..
సెలెక్ట్ కమిటీల ఏర్పాటుపై బయట జరుగుతున్న ప్రచారమంతా వట్టిదేనని, మండలి చైర్మన్ షరీఫ్ పేరుతో ఎలాంటి లేఖలు రాలేదని, బుధవారం నాటికి కనీసం పార్టీలకు కూడా లేఖలు వెళ్లలేదని అసెంబ్లీ అధికారులు తెలిపారు. ఒకవేళ సెలెక్ట్ కమిటీలు ఏర్పాటయ్యేపక్షంలో ముందుగా బులిటెన్ విడుదల చేసిన తర్వాతే ప్రక్రియ మొదలవుతుందని వారుచెప్పారు.

వైసీపీదీ అదే మాట..
సెలెక్ట్ కమిటీల ఏర్పాటుకు సంబంధించి అసలు లేఖల సంవాదమే జరగలేదని అధికార వైసీపీ నేతలు అంటున్నారు. ఈ విషయంలో టీడీపీ అనుకూల మీడియా ప్రజల్ని గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం చేసిందని, సెలెక్ట్ కమిటీలు ఏర్పాటయ్యే అవకాశమేలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications