ఏపీలో గెలిచేదెవరు ? మాజీ మంత్రి కొణతాల జోస్యం..!
ఏపీలో ఈసారి జరిగిన ఎన్నికల్లో భారీ స్ధాయిలో నమోదైన పోలింగ్ అన్ని పార్టీల్లోనూ ఆశలు రేపుతోంది. ముఖ్యంగా గత ఎన్నికలతో పోలిస్తే పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలమన్న దానిపైనా రాజకీయ పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి చెందిన మాజీ మంత్రి, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధి కొణతాల రామకృష్ణ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుతో భేటీ అయిన కొణతాల ఏపీలో ఏ పార్టీ గెలవబోతోందో చెప్పేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు కూటమి నేతలు కూడా ఆశించిన విధంగానే రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కొణతాల రామకృష్ణ జోస్యం చెప్పారు. ఎన్నికలు జరిగిన తీరుపై అశోక్ గజపతిరాజుతో భేటీ అయి వివరాలు పంచుకున్న కొణతాల అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసారి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉరకలు వేస్తుందని కొణతాల తెలిపారు.

ఈసారి జరిగిన ఎన్నికల సమయంలో లోక్‌సత్తా పార్టీ సైతం ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించిందని, అందుకు జయప్రకాశ్ నారాయణకు కృతజ్ఞతలు చెప్తున్నట్లు కొణతాల రామకృష్ణ తెలిపారు. అలాగే ఉద్యోగులు, నిరుద్యోగులు, మేధావులు, రాష్ట్ర ప్రజలంతా తమ వెంటే ఉన్నారని తమ గెలుపును ఎవ్వరూ ఆపలేరని కొణతాల వ్యాఖ్యానించారు. సీనియర్ రాజకీయ నాయకుడైన కొణతాల ఈసారి ఎన్నికల్లో కూటమి అభ్యర్ధిగా అనకాపల్లి అసెంబ్లీ సీటులో బరిలోకి దిగారు. జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీట్లలో ఇది కూడా ఒకటి. అలాగే కొణతాల గెలిచి, ఎన్డీయే అధికారంలోకి వస్తే చంద్రబాబు కేబినెట్ లో ఆయనకు మంత్రి పదవి కచ్చితంగా దక్కుతుందన్న అంచనాలున్నాయి.












Click it and Unblock the Notifications