Raghuveera Reddy : పొలిటికల్ రీ ఎంట్రీపై రఘువీరా క్లారిటీ-రాహుల్ యాత్రలో పాల్గొన్నాక....
ఒకప్పుడు ఏపీలో వ్యవసాయమంత్రిగా, అనంతరం పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సీనియర్ నేత నీలకంఠాపురం రఘువీరారెడ్డి 2019 ఎన్నికలకు ముందే రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని తన స్వగ్రామం నీలకంఠాపురంలోనే వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఆయన మాజీ బాస్ రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో పాదయాత్రలో కలిసే అవకాశం వచ్చింది.
ఏపీలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కోసం త్వరలో రానున్నారు. కర్నూలు జిల్లా గుండా సాగే ఈ యాత్రలో రాహుల్ ను కలవాలని రఘువీరారెడ్డి భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగానే వెల్లడించారు. దీంతో రఘువీరా తిరిగి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై రఘువీరారెడ్డి ఇవాళ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు తన రాజకీయ భవిష్యత్ పై మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన రాజకీయ సెలవు కొనసాగుతుందని రఘువీరా వ్యాఖ్యానించారు. మూడేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నానన్నారు. ఆలయ నిర్మాణ సమయంలో తాను రాజకీయాలు మాట్లాడనని చెప్పానని, ఇప్పటికీ అదే మాట మీద ఉన్నానన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో మాత్రం పాల్గొంటానని రఘువీరా తెలిపారు. కానీ ఇందులో రాజకీయం లేదన్నారు. ఆలయం తరుఫున వెళ్లి పట్టుశాలువా, ప్రసాదం అందజేస్తానని వెల్లడించారు. అంత పెద్ద వ్యక్తి వచ్చినప్పుడు వెళ్లక తప్పదన్నారు. ఆ తర్వాత యధాప్రకారం రాజకీయాలకు దూరంగా ఉంటానని రఘువీరా స్పష్టం చేశారు. దీంతో రఘువీరా పొలిటికల్ రీఎంట్రీపై జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లయింది.












Click it and Unblock the Notifications