ఈ ఆరునెలల్లో ఏం చేశారు? శ్వేతపత్రం విడుదల: చంద్రబాబుకు సీబీఐ మాజీ డైరెక్టర్ ఓపెన్ లెటర్
M Nageswara Rao: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ముందుకు సీబీఐ మాజీ ఇన్‌ఛార్జ్ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు కీలక ప్రతిపాదన తీసుకొచ్చారు.
చంద్రబాబు సారథ్యంలో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్ 12వ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తవుతుందని, ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాశారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు చేసిన విమర్శలను నాగేశ్వరరావు గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలను, పరిపాలనను గతంలో చంద్రబాబు, జనసేన నాయకులు ఎన్నో విధాలుగా తప్పుపట్టారని అన్నారు.
జగన్ ప్రభుత్వంలో సంభవించిన దుశ్చర్యలన్నింటినీ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే సరిదిద్దుతామని లేకపోతే రద్దు చేస్తామని కూడా చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. జగన్ పాలన దుర్మార్గమని, నేరపూరితమని, దౌర్జన్యపూరితమని, అవినీతి కుంపటి అని చంద్రబాబు చేసిన విమర్శలను నాగేశ్వరరావు తన లేఖలో ప్రస్తావించారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ పరిపాలనలో చోటు చేసుకున్న అవినీతి, దుర్మార్గపు చర్యలకు పాల్పడిన వారు, నేరస్తుపై చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చంద్రబాబు.. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు హామీలు ఇచ్చారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని, ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉండాలని చంద్రబాబు ఎప్పుడు చెప్పుతుంటారని నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.
ఈ ఆరు నెలల్లో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం జగన్ పాలనలోని చోటు చేసుకున్న ఎలాంటి తప్పిదాలు, తప్పుడు విధానాలను రద్దు చేశారా?, దుర్మార్గపు చర్యలకు దిగిన వారు, నేరస్తులు, అవినీతిపరులు, ప్రజా సంపదను దోచుకున్న వారు, ప్రకృతి వనరులను కొల్లగొట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?, ఎంత మందిని అరెస్టు చేశారు? వంటి వివరాలతో ఒక శ్వేత పత్రాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications