విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మంటలు - హైకోర్టులో మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిల్
విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏపీలో కాకరేపుతోంది. ఇప్పటికే విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి మద్దతు పెరుగుతుండగా.. దీనికి మద్దతునిస్తున్న వారు ఒక్కొక్కరుగా న్యాయపోరాటానికి దిగుతున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఓసారి విచారణ కూడా జరిగింది. అయితే విదేశాల్లో ఉంటూ ఇక్కడ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయొచ్చా లేదా అనే అంశంపై హైకోర్టు వివరణ కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉండగానే.. ఇప్పుడు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మరో పిల్ దాఖలు చేశారు. స్టీల్ ప్లాంట్ పై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు రేపు విచారణ జరపనుంది. ఇప్పటికే ఇదే అంశంపై కేఏ పాల్ కూడా పిల్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రెండింటినీ కలిపి విచారిస్తారా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
విశాఖ ఉక్కు ఉద్యమంలో భాగంగా తొలి రాజీనామా సమర్పించిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌తో ఇప్పటికే లక్ష్మీనారాయణ చర్చలు జరిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకు అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు. ఆ తర్వాత ఇప్పుడు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications