VV Lakshminarayana: అవసరమైతే కొత్త రాజకీయ పార్టీ-జేడీ లక్ష్మీనారాయణ హింట్..
ఏపీలో సీబీఐ మాజీ జేడీగా సుపరిచితుడైన వీవీ లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో పోటీపై ఇన్నాళ్లు జరుగుతున్న చర్చ కాస్తా ఇప్పుడు రాజకీయ పార్టీగా దిశ మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన వీవీ లక్ష్మీనారాయణ ఇప్పుడు అవసరమైతే కొత్త రాజకీయ పార్టీ పెడతానంటూ ఇవాళ సంచలన ప్రకటన చేశారు. తాజాగా తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్క(శిరీష)కు మద్దతుగా ఆలంపూర్ సీట్లో ప్రచారం చేసి వచ్చిన ఆయన.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారాలని భావిస్తున్నారు.
ఏపీలో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి పోటీకి సిద్దమవుతున్న సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తానని మరోసారి ఆయన స్పష్టం చేశారు. అయితే రాజకీయ పార్టీల్ని బతిమాలే కంటే స్వతంత్ర అభ్యర్ధిగా కూడా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో అవసరం అయితే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

మరోవైపు ఏపీలో బోగస్ ఓట్లపై జరుగుతున్న చర్చపై స్పందించిన వీవీ లక్ష్మీనారాయణ.. ఫేక్ ఓట్ల ఏరివేత ఖచ్చితంగా జరగాలన్నారు. డూప్లికేట్ ఓట్లు తొలగించాల్సిందే అని అన్నారు. నిజమైన ఓట్ల తొలగింపుపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని వీవీ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. జేడీ ఫౌండేషన్, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 2న విశాఖలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాబ్ ఫేర్‌లో 50కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు.
విశాఖలో తాను నిర్వహించే జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్ధులు ఉద్యోగాలకు ఎంపికైతే అక్కడే ఆఫర్ లెటర్‌లు కూడా ఇస్తామని వీవీ లక్ష్మీనారాయణ చెప్పారు. ఇందులో కొంచె వెనుకబడే అభ్యర్థులకు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తామన్నారు.పదో తరగతి ఆపై విద్యార్హత ఉన్న వారు ఎవరైనా జాబ్ ఫేర్‌కు హాజరు కావచ్చని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications