చంద్రబాబు ఎంత భయస్తుడంటే ? అరెస్టుతో వైసీపీకి.. ! కాంగ్రెస్ మాజీ ఎంపీ షాకింగ్..
ఏపీలో స్కిల్ డెవల్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్టు (chandrababu arrest) వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఏపీలో వైసీపీ, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి ఇది కారణమవుతుండగా.. జాతీయ మీడియా ఛానళ్లు సైతం చర్చోపర్చలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. దాదాపు 50 ఏళ్లుగా చంద్రబాబు గురించి తెలిసిన ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.
చంద్రబాబు జైల్లో, జగన్ బెయిల్ పై : చంద్రబాబు అరెస్టుపై మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ (chinta mohan) స్పందించారు. చంద్రబాబు జైల్లో, సీఎం వైఎస్ జగన్ (ys jagan) బెయిల్ పై ఉన్నారని చింతా మోహన్ వ్యాఖ్యానించారు. అలాగే చంద్రబాబు తనకు 49 ఏళ్లుగా తెలుసన్నారు. ఆయన చాలా భయస్తుడని, ఎంత భయస్తుడంటే సొంత తమ్ముడికి మేలు చేసినా జనం ఏమనుకుంటారో అని సాయం చేయకుండా ఉండిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో జరిగిన చంద్రబాబు అరెస్టుపై స్పందిస్తూ.. వ్యక్తిగత కక్ష రాజకీయాలు మంచివి కాదని చింతా మోహన్ హితవు పలికారు. గతంలో మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ఎంతో కలిసి మెలసి ఉండేవారని కాంగ్రెస్ మాజీ ఎంపీ గుర్తుచేసుకున్నారు. కానీ ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ తనకు రాజకీయ అనుభవం లేకపోవడం వల్ల చంద్రబాబు అరెస్టు వంటి చర్యలు తీసుకుంటున్నారన్నారు.

మరోవైపు చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో ఆయనకు లభిస్తున్న స్పందనపైనా చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబును అరెస్టు చేయాలన్న వైసీపీ సర్కార్ నిర్ణయం ఆయనకే అనుకూలంగా మారిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ విశ్లేషించారు. దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఉంటుందన్నారు. అలాగే రాష్ట్రంలో 17వేల కోట్ల టీటీడీ నిధులు, బంగారం నిల్వలు ఎక్కడ పోయాయో అధికారులు చెప్పాలన్నారు. రూ.17వేల కోట్లను వడ్డీ కోసం ఇచ్చామంటున్నారని, ఎక్కడ ఇచ్చారంటే మాత్రం టీటీడీ నుంచి సమాధానం లేదని చింతా మోహన్ విమర్శించారు.












Click it and Unblock the Notifications