మాజీ హీరోయిన్ల డైలమా: రాజకీయ ఊగిసలాట!
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన నిన్నటితరం హీరోయిన్లు.. జయసుధ, జయప్రద, విజయశాంతిలు ప్రస్తుతం రాజకీయాల విషయంలో మాత్రం డైలమాలో ఉన్నారని చెప్పవచ్చు. జయసుధ, విజయశాంతిలు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నప్పటికీ, జయప్రద మాత్రం జాతీయ రాజకీయాల్లో ఉన్నారు.
అయితే, ప్రస్తుతం వారు తమ రాజకీయ భవిష్యత్తుపై డైలమాలో ఉన్నారని అంటున్నారు. సికింద్రాబాద్ మాజీ శాసన సభ్యురాలు జయసుధ 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమె రాజకీయాలపై వైరాగ్యం ప్రదర్శించారు.
ఒక విధంగా చెప్పాలంటే ఆమె అయిష్టంగానే రాజకీయాల్లో కొనసాగుతున్నారనే వాదనలు ఉన్నాయి. మొదటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఆమె.. మధ్యలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపి మళ్లీ వెనక్కి వచ్చారు.
ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారా లేదా అనే చర్చ కూడా సాగింది. ఎందుకంటే, అంతకుముందు పలుమార్లు ఆమె అందుకు అనుగుణంగానే వ్యాఖ్యలు చేశారు.

తాజాగా మరోసారి, జయసుధ పేరు తెరపైకి వచ్చింది. ఆమె తెరాసలో చేరుతారనే ప్రచారం సాగినప్పటికీ, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని వివరణ ఇచ్చారు. అయితే, ఏ పార్టీలో చేరాలనే విషయమై, రాజకీయాల్లో కొనసాగడంపై జయసుధ డైలమాలోనే ఉండవచ్చునని చెబుతున్నారు.
విజయశాంతి బీజేపీలో, టీఆర్ఎస్‌లో పని చేశారు. కొత్త పార్టీ పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే, విభజన అనంతరం ఆమె బయటకు కనిపించిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పవచ్చు. తెలంగాణ కోసం ఉద్యమించిన ఆమె సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఏ పార్టీలో చేరాలనే విషయమై డైలమాలో పడ్డారు.
బీజేపీ, కొత్త పార్టీ అనంతరం ఆమె టీఆర్ఎస్‌లో చేరారు. ఆ పార్టీ తరఫున 2009లో మెదక్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే, కేసీఆర్‌తో విభేదాల కారణంగా తెలంగాణకు అనుకూలంగా ఉన్న బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు వినిపించాయి.
తెలంగాణలో అద్వానీ యాత్రలో ఆమె పాల్గొన్నారు. టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరుతారని ప్రచారం సాగింది. తనకు అద్వానీతో మంచి సంబంధాలు ఉన్నాయని ఆమె చెప్పారు కూడా. ఆ తర్వాత బీజేపీ సహకారంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసింది. దీంతో విజయశాంతి చేతి గుర్తుకు ఓటేశారు.
అయితే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఓటమి చెందడంతో ఆమె ఎన్నికల అనంతరం కనిపించడం లేదు. రెండు రోజుల క్రితం మాత్రం సెక్షన్ 8 గురించి ఆమె మాట్లాడారు. సెక్షన్ 8 సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.
జయప్రద టీడీపీ ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేశారు. అనంతరం ఉత్తర ప్రదేశ్ వెళ్లి సమాజ్ వాది పార్టీలో చేరారు. రాజకీయంగా అమర్ సింగ్‌తో ఆమెకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత అమర్ సింగ్‌తో పాటే ఆమె ములాయం పార్టీని వీడారు.
ఆ తర్వాత అమర్ సింగ్ పార్టీ పెట్టడంతో ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. ఇటీవలే ఆమెను ఎస్పీ రాజ్యసభకు పంపిద్దామని భావించిందని, కానీ ఆమెకు బద్ధ శత్రువైన అజం ఖాన్ అడ్డుపడ్డారనే వాదనలు వినిపించాయి.
అంతేకాదు, సార్వత్రిక ఎన్నికలకు ముందు జయప్రద ఏపీ లేదా తెలంగాణకు వస్తారని, రాజమండ్రి నుండి ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నాయనే వాదనలు వినిపించాయి. ప్రస్తుతం జయప్రద కూడా తేల్చుకోలేని స్థితిలో ఉన్నారని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications