సీఎం జగన్ కు మాజీ జేడీ లక్ష్మీనారాయణ మద్దతు..!!
ఏపీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఆరోపణలు సంధిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ప్రతీ సభలోనూ దుష్టచతుష్టయం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు - పవన్ కల్యాణ్ తో పాటుగా మద్దతుగా నిలుస్తున్న మీడియాను కార్నర్ చేస్తున్నారు. తాజాగా జగన్ ప్రభుత్వం బహిరంగ సభలు - రోడ్ షో లపైన కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్లపై సభల నిర్వహణకు అనుమతి నిరాకరించింది. ఈ ఉత్తర్వుల పైన ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నాయి. ఇదే సమయంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జగన్ పాలన..నిర్ణయాలపైన కీలక వ్యాఖ్యలు చేసారు.

జగన్ నిర్ణయాలకు మాజీ జేడీ మద్దతు
రోడ్ల పై సభల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి రద్దు చేసింది. దాదాపుగా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. కానీ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మానారాయణ ఈ నిర్ణయాన్ని సమర్ధించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో తప్పు లేదని అభిప్రాయపడ్డారు. రోడ్ల పైన సభలు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వ నిర్ణయం తప్పనిసరని పేర్కొన్నారు. ముందస్తుగా అనుమతి కోరితే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా పోలీసు శాఖ అనుమతి ఇవ్వటంతో పాటుగా అవసరమైన చర్యలు తీసుకుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిర్ణయాలు చేయటం అధికారుల బాధ్యతగా పేర్కొన్నారు. ప్రతీ నిర్ణయాన్ని వ్యతిరేకంగా చూడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి
వరుసగా యూ ట్యూబ్ ఛానళ్లతో తన అభిప్రాయాలు పంచుకుంటున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అయితే, ప్రజలు ఏ స్థాయిలో వీటిని స్వాగతిస్తున్నారు.. జగన్ నిర్ణయాలకు ఎన్నిక మార్కులు ఇస్తారనేది వచ్చే ఎన్నికల్లో స్పష్టత వస్తుందని చెప్పుకొచ్చారు. తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో లో నిర్ణయాలు ఒక్క పార్టీకి మాత్రమే అమలు కావని చెప్పారు. అలా జరిగితే అప్పుడు పార్టీలు న్యాయస్థానం ఆశ్రయించే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో ఎక్కడా సభలను నిషేదించలేదని, రోడ్ల పైన మాత్రమే వద్దని అందులో స్పష్టం చేసిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తప్పు లేదని అభిప్రాయపడ్డారు.

ప్రతిపక్షాల వాయిస్ కు భిన్నంగా...
మాజీ జేడీ లక్ష్మీనారాయణ విధి నిర్వహణలో ఉన్న సమయంలో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. 2019 ఎన్నికల ముందు జనసేనలో చేరి విశాఖ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లోనూ విశాఖ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తారని చెబుతున్నారు. అయితే, ఎన్నికల సమయానికి లక్ష్మీనారాయణ ప్రముఖ పార్టీలో చేరటం ఖాయమనే వాదన ఉంది. ఇక.. జగన్ సంక్షేమ పథకాలు, నిర్ణయాలను ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో తప్పు బడుతున్నాయి. ఇదే సమయంలో లక్ష్మీనారాయణ జగన్ తీసుకున్న నిర్ణయాలపైన వెల్లడిస్తున్న అభిప్రాయాలు...ఆ నిర్ణయాల్లోని అంశాలను వివిరిస్తున్న తీరు ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications