టీడీపీ టు వైసీపీ వయా బీఆర్ఎస్: మాజీ మంత్రికి సీట్ ఖాయం
Ravela Kishore Babu: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటోన్న మార్పులు చేర్పులు కొత్త సమీకరణాలకు దారి తీస్తోన్నాయి. టికెట్ దక్కని సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆశావహులు రాజీనామాల బాట పడుతున్నారు. వైసీపీ అగ్రనాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్నారు.
ఇప్పటికే కర్నూలు, నరసరావుపేట, మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీలు డాక్టర్ సంజయ్ కుమార్, లావు కృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి.. పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీలు సీ రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్, దాడి వీరభద్రరావు గుడ్ బై చెప్పారు. మార్పులు చేర్పులకు అంగీకరించకపోవడం, మళ్లీ పోటీ చేేసే అవకాశం దక్కకపోవడం వంటి కారణాలతో వారంతా రాజీనామాల బాట పట్టారు.

అదే సమయంలో వైఎస్ఆర్సీపీలో చేరికలకూ లోటు ఉండట్లేదు. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నేతలు అధికార పార్టీ కండువాను కప్పుకొన్నారు. టీడీడీపీకి చెందిన విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని, ఆయన కుమార్తె కేశినేని శ్వేత, తిరువూరు మాజీ శాసన సభ్యుడు నల్లగట్ల స్వామిదాస్.. వంటి నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
తాజాగా- టీడీపీకే చెందిన మరో మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు.. వైసీపీలో చేరారు. కొద్దిసేపటి కిందటే ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగ్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు కండువా కప్పి.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు జగన్.

ప్రస్తుతం ఆయన భారత్ రాష్ట్ర సమితిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2014 నుంచి 2019 మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల తరువాత టీడీపీకి గుడ్ బై చెప్పారు. తొలుత జనసేన, ఆ తరువాత బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు.
అనంతరం గత ఏడాది అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. అక్కడ ఇమడలేకపోయారు. ఎక్కువ రోజులు కొనసాగలేకపోయారు. రాజకీయాలకు దాదాపుగా దూరమైనట్టే కనిపించారు రావెల. ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆయనకు అసెంబ్లీ సీట్ ఖరారైందనే ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications