భరించలేకపోతున్నా.. రాజీనామాకు కారణం చెప్పి కంటతడి పెట్టుకున్న మాజీమంత్రి బాలినేని
బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా వైసిపి రీజనల్ కోఆర్డినేటర్ గా తాను రాజీనామా చేయడం వెనుక కారణాలను వెల్లడించారు.తనపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు అలా ఎందుకు తనపై దుష్ప్రచారానికి దిగుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని చెప్పిన ఆయన,తాను టికెట్ ఇప్పించిన వారే తనపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఆరోపణల వెనుక ఎవరున్నారు అనేది మీరే తెలుసుకోవాలని పేర్కొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి తనకు వైయస్సార్ రాజకీయ బిక్ష పెట్టారని, పార్టీ ఆవిర్భావం నుంచి కీలక నేతగా వ్యవహరించానని పేర్కొన్నారు.

ఇక ఈ వివాదాలకు అధిష్టానమే ముగింపు పలుకుతుందని తాను ఆశిస్తున్నట్లు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తాను తన నియోజకవర్గం పై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని అందుకే రీజినల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు .తనని ఇబ్బంది పెడుతున్న వారి పేరు ప్రత్యేకంగా తాను చెప్పవలసిన అవసరం లేదని బాలినేని శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
తనపై వేస్తున్న నిందలను,చేస్తున్న ఆరోపణలను తాను భరించలేకపోతున్నానని బాలినేని శ్రీనివాస రెడ్డి కంటతడి పెట్టుకున్నారు.తన గురించి మాట్లాడవలసిన అవసరం గోనె ప్రకాశ్ రావుకు ఏముందని ప్రశ్నించిన ఆయన కొందరు కావాలనే తన పై ఆ విధంగా మాట్లాడిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు నియోజకవర్గంలో తనపై ఎటువంటి వ్యతిరేకత లేదని,మూడు జిల్లాల కోఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వర్తించలేక,మూడు జిల్లాల్లో గడపగడపకు తిరగలేక కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశానని ఆయన స్పష్టం చేశారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలతో ఒంగోలు వేదికగా వైసీపీలో చోటు చేసుకున్న అంతర్గత పోరు బయటకు వచ్చింది.












Click it and Unblock the Notifications