ఒంగోలు నుంచి పోటీపై బాలినేని క్లారిటీ- వైవీపై పరోక్ష వ్యాఖ్యలు..
ఏపీలోని ప్రకాశం జిల్లాలో వైసీపీ అంతర్గత పోరు నేపథ్యంలో ఒంగోలు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసలరెడ్డి పోటీ చేస్తారా లేదా అన్న దానిపై ఈ మధ్య ఉత్కంఠ పెరుగుతోంది. ఆయనకు వరుసకు బావ అయ్యే వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డితో సాగుతున్న ఆధిపత్య పోరు నేపథ్యంలో బాలినేని భవిష్యత్తుపై రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలినేని వీటిపై స్పందించారు. స్ధానిక పోరుపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూనే ఒంగోల్లో పోటీపై క్లారిటీ ఇచ్చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచి మరోసారి పోటీ చేసి తీరుతానంటూ వైసీపీ మాజీ మంత్రి బాలినేని స్పష్టం చేశారు. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఒంగోలేనని, మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేస్తానంటూ నిన్న స్ధానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో బాలినేని వెల్లడించారు. జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, దర్శి నుంచి తాను పోటీ చేస్తానంటూ ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే రాష్ట్రంలో సంక్షేమ పథకాలపైనా బాలినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అందిస్తుంటే మనం మాత్రం కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదనే అసంతృప్తి నెలకొందన్నారు. వారిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. తనకు అయినవాళ్లు, కానివాళ్లంటూ ఎవరూ లేరని, కావాల్సింది కార్యకర్తలేనని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని పేర్కొన్నారు. వారి కోసం తమ నాయకుడైన జగన్ ను తప్ప ఎవరినీ లెక్క చేయబోనన్నారు.
వైసీపీలో అయినవాళ్లే తనపై కుట్రలు చేసి ఇబ్బంది పెడుతున్నందుకు ఇటీవల బాధపడ్డానని వైవీ సుబ్బారెడ్డిని ఉద్దేశించి బాలినేని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆలోచిస్తే మాత్రం అలాంటి వారిని లెక్కచేయాల్సిన అవసరం లేదని అనిపిస్తోందన్నారు. కార్యకర్తలు తనని ఐదుసార్లు గెలిపించారని, వారి రుణం తీర్చుకుంటానని బాలినేని వ్యాఖ్యానించారు. వైవీ సుబ్బారెడ్డితో ఆధిపత్య పోరు నేపథ్యంలో బాలినేని తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications