Ganta Srinivas : వచ్చే ఎన్నికల్లో గెలిచేదెవరు ? కారణమిదే..గంటా మార్క్ విశ్లేషణ..!
ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలిచేదెవరు ? ఈ ప్రశ్నకు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, నేతలు తమదైన విశ్లేషణలు చేసేస్తున్నారు. రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ రంగం సిద్ధంచేసుకుంటుంటే, దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలని టీడీపీ-జనసేన-బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరుణంలో వైసీపీ వర్సెస్ విపక్షాలుగా మారిపోయిన పోరులో ఎవరికి వారు తమ అదృష్టం పరీక్షించుకునేందుకు చివరి ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో వందశాతం అధికారంలోకి వచ్చేది టీడీపీయేనని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇవాళ అన్నారు. చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని ఆయన వెల్లడించారు. ఇందుకు ఏయే కారణాలు దోహదం చేయబోతున్నాయో కూడా గంటా శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో తాజాగా చంద్రబాబు రాయలసీమ టూర్ తో పాటు టీడీపీ మ్యానిఫెస్టో విడుదల వంటి కారణాలను గంటా ఇందులో ప్రస్తావించారు. దీంతో గంటా లెక్కలపై చర్చ జరుగుతోంది.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ సందర్శన కోసం ఈనెల 8న టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ నగరానికి వస్తున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. తాజాగా రాయలసీమ లో చంద్రబాబు టూర్ కు అనూహ్య స్పందన వస్తోందని, ముఖ్యంగా పులివెందులతో ఆయన పర్యటనకు వచ్చిన స్పందనే ఇందుకు నిదర్శమని గంటా తెలిపారు. ప్రస్తుతం తాము వై నాట్ పులివెందుల అనగలుగుతున్నామని, రాబోయే ఎన్నికల్లో పులివెందుల ప్రజలు కూడా స్పష్టమైన తీర్పు ఇస్తారన్నారు.
వైసీపీ నేతలు అమరావతి ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణం పేరుతో హడావిడి చేసి రాజధాని పాడు చేయాలని చూశారని, చివరికి కోర్టు అడ్డుకట్ట వేసిందని గంటా శ్రీనివాస్ తెలిపారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచుతానన్న జగన్.. తానే మెడ వంచారని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ ఈసారి మ్యానిఫెస్టోలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని, ఇప్పటికే చంద్రబాబు మినీ మ్యానిఫెస్టో ఇచ్చారని గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications