పాదయాత్రలకు కాలంచెల్లింది-పట్టించుకోవట్లేదు-లోకేష్, రేవంత్ పై జేసీ దివాకర్ రెడ్డి...
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల నేపథ్యంలో పాదయాత్రలతో ప్రజలకు చేరువయ్యేందుకు నారా లోకేష్ రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వాటితో ఉపయోగం లేదని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.
ఏపీలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. గతంలో తన తండ్రి చంద్రబాబుతో పాటు వైఎస్, జగన్ వంటి వారు పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాను కూడా టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు ఈ మార్గం ఎంచుకున్నారు. అలాగే తెలంగాణలోనూ వచ్చే ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో పాదయాత్రలు వేస్టని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఇవాళ వ్యాఖ్యానించారు.
ఇవాళ తెలంగాణ సీఎల్పీ కార్యాలయానికి వెళ్లిన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి.. అక్కడ కాసేపు కాంగ్రెస్ నేతలతో పిచ్చాపాటీ మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇవాళ పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి మొదలుపెడుతున్న పాదయాత్రతో పాటు ఈ మధ్య కాలంలో ఏపీలో నారా లోకేష్ పాదయాత్రపైనా చర్చ వచ్చింది.దీనిపై స్పందించిన జేసీ దివాకర్ రెడ్డి పాదయాత్రలకు కాలం చెల్లిందన్నారు. ఈ రోజుల్లో పాదయాత్రల్ని ఎవరూ పట్టిచుకోవడం లేదంటూ జేసీ వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డితో పాటు నారా లోకేష్, ఇంకెవరు పాదయాత్రలు చేసినా ఇప్పుడు లాభం లేదంటూ తనదైన శైలిలో జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో పాదయాత్రలు వేరు, ఇప్పుడు వేరని జేసీ అన్నారు. డబ్బుతో కూడుకున్న యాత్రలే ఇప్పుడు సాగుతున్నాయని జేసీ దివాకర్ రెడ్డి వెల్లడించారు. వీటిని జనం పట్టించుకునే పరిస్దితి లేదన్నారు. దీంతో టీడీపీ నేతగా ఉంటూ లోకేష్ పాదయాత్ర వృథా అంటూ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. అసలే జగన్ పాలన వచ్చాక రాజకీయంగా యాక్టివ్ గా లేని జేసీ.. ఇప్పుడు పాదయాత్రలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.












Click it and Unblock the Notifications