టీడీపీకి మరో షాక్ ... జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ వైసీపీ తీర్ధం పుచ్చుకుంటే , ఇటీవల కడప జిల్లా పులివెందులకు చెందిన కీలక నాయకుడు సతీష్ రెడ్డి వైసీపీ బాట పట్టారు. ఇక వీరే కాదు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీకి జై కొడుతుండగా ఇక మాజీ మంత్రి , టీడీపీ కీలక నేత రామ సుబ్బా రెడ్డి నేడు వైసీపీ లో చేరి చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చారు .

వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత రామసుబ్బారెడ్డి
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రాజకీయ వలసలకు తెరలేపింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టీడీపీని ఎన్నికల సమయంలో దెబ్బ కొట్టే పనిలో ఉంది. టీడీపీలో ఒక అనిశ్చితి వాతావరణం క్రియేట్ చేసి మైండ్ గేమ్ ఆడుతుంది. అందులో భాగంగా భారీగా వలసలను ప్రోత్సహిస్తుంది. దీంతో, తెలుగు దేశం పార్టీ నుంచి క్రమంగా వైసీపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ కీలక నేత రామ సుబ్బా రెడ్డి ఫ్యాన్ పార్టీలో చేరారు.
Recommended Video


రామసుబ్బారెడ్డికి కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్
ఇక నేడు సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలసిన ఆయన జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక సీఎం జగన్ రామసుబ్బారెడ్డికి కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు . అయితే సుదీర్ఘకాలం పాటు టీడీపీలో కొనసాగిన రామ సుబ్బారెడ్డి టీడీపీలో కీలకంగా పని చేశారు. టీడీపీలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న ఆయన సుదీర్ఘ కాలం పని చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి మరో షాక్
తన చిరకాల శత్రువు ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి వచ్చినా కూడా టీడీపీలోనే కొనసాగిన రామసుబ్బారెడ్డి ఇంత కాలానికి ఇప్పుడు వైసీపీలో చేరిపోయారు. రామ సుబ్బా రెడ్డి మాత్రమే కాదు చాలా మంది కీలక నాయకులు కూడా టీడీపీ వీడి వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న ఈ వలసలతో టీడీపీ ఎన్నికలలో ఫెయిల్ అవుతుందనే భావనలో ఉంది వైసీపీ .












Click it and Unblock the Notifications