ఊహించని పార్టీలోకి రాపాక ఎంట్రీ..?
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆ పార్టీకి చాలామంది నాయకులు రాజీనామా చేస్తున్నారు. సీనియర్ నాయకులు సైతం వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. బాలినేని, సామినేని బాటలోనే మరి కొందరు ఉన్నారని తెలుస్తోంది. వీరిలో ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.జగన్‌కు సన్నిహితంగా ఉన్న నేతలు సైతం పక్క చూపులు చూస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన తరుఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.
ఆయన రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో రాపాక అధికార వైసీపీకి దగ్గరయ్యారు. ఆ సమయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై రాపాక తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి అమలాపురం ఎంపీగా పోటీ చేసిన రాపాక వర ప్రసాద్ ఓడిపోయారు. ఓడిపోయిన దగ్గర నుంచి రాపాక వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈవీఎంల వల్లే కూటమి గెలిచిందని వైసీపీ నాయకులు ఆరోపించిన తరుణంలో జనం వైసీపీకి ఓట్లు వేయలేదని చెప్పి బాంబు పేల్చారు.

దీంతో ఆయన వైసీపీని వీడటం ఖాయమని అంతా భావించారు. అందరు భావించినట్టే రాపాక వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ కోసం ఎంతో కష్టపడినా.. తనను వైసీపీ అవమానించిందని వరప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజోలులో కష్టపడి పనిచేసినా తనకు టికెట్ ఇవ్వలేదని వాపోయారు. తనపై నమ్మకం లేక గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ ఇచ్చారన్నారు. ఇష్టం లేకపోయినా పెద్దల సూచన మేరకు ఎంపీగా పోటీ చేశానని రాపాక వరప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాను వైసీపీతో తెగదెంపులు చేసుకున్నట్లు చెప్పారు.
ఆయన తిరిగి జనసేనకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, పార్టీ అధినాయకత్వంతో పాటు, జనసేన కార్యకర్తలు రాపాక ఎంట్రీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.దీంతో ఆయన టీడీపీలో చేరడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈమేరకు జిల్లా మంత్రితో ఆయన చర్చలు జరిపినట్టు వార్తలొస్తున్నాయి. అయితే జనసేనతో ఉన్న మిత్ర బంధం కారణంగా టీడీపీలోకి రాపాక ఎంట్రీ కష్టతరంగా మారిందని తెలుస్తోంది.
ఆయన జనసేనలోనే ఉండి ఉంటే ఈ రోజున మంత్రి స్థానంలో ఉండేవారు. అప్పుడు పార్టీకి వ్యతిరేకంగా వెళ్లి, ఇప్పుడు నానా తిప్పలు పడుతున్నారు.రాపాక రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ , 2019లో జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్లాలో తెలియని అయోమయస్థితిలో నిలిచారు. ఒకవేళ టీడీపీ అధినాయకత్వం నుంచి గ్రీన్ సీగ్నల్ వస్తే ఆయన పసుపు కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications