వైసీపీకి రాపాక షాక్..! ట్యాపరింగ్ అబద్ధం.. జరిగిందిదేనట..!
ఏపీలో తాజా ఎన్నికల ఫలితాలు వైసీపీకి భారీ షాకిచ్చాయి. వైసీపీయే కాదు కూటమిలో ఏ పార్టీ కూడా ఊహించని స్ధాయిలో జనం తీర్పు ఇచ్చారు. దీంతో కూటమి 164 సీట్లతో అధికారం చేపట్టగా .. వైసీపీ చరిత్రలోనే అత్యల్పంగా 11 సీట్లకు పరిమితమైంది. దీంతో షాక్ కు గురైన వైఎస్ జగన్, వైసీపీ నేతలు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉండొచ్చని, ఈవీఎంలను అభివృద్ధి చెందిన దేశాలు కూడా వాడటం లేదని రకరకాల వాదనలు తెరపైకి తెస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాపాక స్పందించారు.
ఒకప్పుడు జనసేన తరపున గెలిచి వైసీపీలోకి ఫిరాయించి తాజా ఎన్నికల్లో అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన రాపాక వరప్రసాదరావు ఎన్నికల ఫలితాల తర్వాత తమ పార్టీ నేతలు చేస్తున్న వాదనపై స్పందించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందన్న ఆరోపణలు శుద్ధ అబద్ధమని రాపాక తేల్చిచెప్పేశారు. అలాంటిదేమీ లేదన్నారు. గతంలో అన్ని పార్టీలు విడిగా పోటీచేసినప్పుడు వచ్చిన ఓట్లు తమకు తెలుసని, ఇప్పుడు మూడు పార్టీలు కలిసిపోవడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయన్నారు.

గతంలో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేసినప్పుడు ఓటమి ఎదురైందని, కానీ ఇప్పుడు మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల ఓటు బ్యాంకు బదిలీ అయిందని, అందువల్లే వైసీపీకి ఓటమి తప్పలేదన్నారు. జనం వైసీపీకి ఓట్లు వేయలేదన్నారు. దీంతో వైసీపీ నేతలు చేస్తున్న వాదన అంతా డొల్ల అని రాపాక తేల్చిచెప్పేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని తాను భావించడం లేదని రాపాక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ నేతలకు మంట పుట్టిస్తున్నాయి.












Click it and Unblock the Notifications