అందుకే వైసీపీకి గుడ్ బై-ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పేసిన అవంతి, గ్రంథి..!
ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా మంత్రి పదవి అనుభవించిన భీమిలి మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, భీమవరం ఎమ్మెల్యే పదవి అనుభవించిన గ్రంథి శ్రీనివాస్ తాజాగా ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో పార్టీని వీడారు. ఇవాళ వీరిద్దరూ వరుసగా పార్టీకి తమ రాజీనామాలు సమర్పించారు. అనంతరం వీరిద్దరూ ప్రెస్ మీట్లు పెట్టి తాము వైసీపీని ఎందుకు వీడాల్సి వచ్చిందో వివరించారు. అలాగే తమ భవిష్యత్ ప్రణాళికల్ని కూడా వివరించారు.
ఇవాళ ఉదయం వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేస్తూ వైఎస్ జగన్, విజయసాయిరెడ్డికి లేఖలు పంపిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తన రాజీనామా వెనుక కారణం వెల్లడించారు. ప్రజలు ఐదేళ్ల పాటు పాలించాలని కూటమికి తీర్పు ఇచ్చారని, కానీ జగన్ దాన్ని గౌరవించకుండా ధర్నాలకు పిలుపునిస్తున్నారని, అందుకే వైసీపీని వీడుతున్నట్లు అవంతి పేర్కొన్నారు. వైసీపీలో కార్యకర్తలు ఐదేళ్లు నలిగిపోయారని, పార్టీ అంటే ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలని సూక్తులు కూడా చెప్పారు. అదే సమయంలో కుటుంబం కోసం సమయం వెచ్చించేందుకు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు అవంతి తెలిపారు.

మరోవైపు అవంతి బాటలోనే వైసీపీ కి రాజీనామా చేసిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతానని ప్రకటించారు. గత ఐదేళ్ల పాలనలో భీమవరంలో ఎన్నో ల్యాండ్ మార్కు పనులు, మంచి పనులు చేశానని, తనపై ఎన్నో కుట్రలు పన్నారని ఆరోపించారు. విలువలను పాటించ కుండా తప్పుడు ప్రచారాలు కూడా చేశారని అన్నారు.ఏ పార్టీలోకి వెళ్ళాలి అనే నా నిర్ణయం త్వరలోనే చెబుతానని, కుటుంబ సభ్యుల సూచనలు, నిర్ణయంతో ముందుకు సాగుతానని,ఎక్కడ గౌరవం ఉంటుందో అక్కడే ఉంటానని అన్నారు.












Click it and Unblock the Notifications