వైసీపీలోకి టీడీపీ బిగ్ షాట్ మాగంటి బాబు?
Maganti Babu: వచ్చే ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనడానికి తెలుగుదేశం పార్టీ.. జనసేన, భారతీయ జనతా పార్టీతో కట్టిన కూటమి ప్రభావం సీనియర్లకు టికెట్లు లేకుండా చేస్తోంది. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయులుగా, నిత్యం ప్రజల మధ్య ఉంటూ వచ్చిన నాయకులు పొత్తుల వల్ల సీట్లు, టికెట్లను కోల్పోవాల్సి వస్తోంది.
టీడీపీ, జనసేనకు చెందిన పలువురు సీనియర్ నాయకులు, ఆశావహులు, మాజీ ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్నారు. శివరామరాజు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, కే అప్పల్నాయుడు, యనమల కృష్ణుడు, కేఎస్ జవహర్, జేడీ రాజశేఖర్, పోతిన మహేష్.. వంటి నాయకులు తిరుగుబాటు బాట పట్టారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్నారు.

ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత, ఏలూరు లోక్‌సభ మాజీ సభ్యుడు మాగంటి బాబు పేరు సైతం వినిపిస్తోంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయనకు టికెట్ దక్కని విషయం తెలిసిందే. ఏలూరు లోక్‌సభ టికెట్‌ను మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి అల్లుడు, కడప జిల్లా మైదుకూరు అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ రెండో కొడుకు పుట్టా మహేష్ యాదవ్‌కు ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
ఇది కాస్తా జిల్లా తెలుగుదేశం పార్టీలో తీవ్ర కలకలానికి దారి తీసింది. ఎక్కడో కడప జిల్లాకు చెందిన నాయకుడికి ఏలూరు టికెట్ ఇవ్వడం పట్ల క్యాడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కడప గూండాలు అంటూ గతంలో ఆ జిల్లా ప్రజలను విమర్శించిన చంద్రబాబుకు ఇప్పుడు అక్కడి నాయకులే దిక్కు కావడం చర్చనీయాంశమైంది.
ఏలూరు లోక్‌సభ టికెట్ దక్కని నేపథ్యంలో మాగంటి బాబు.. టీడీపీని వీడాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ ప్రకటించినప్పటి నుంచి ఆయన పార్టీ అగ్రనాయకత్వానికి అందుబాటులో ఉండట్లేదని చెబుతున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలకూ దూరంగా ఉంటోన్నారని సమాచారం.
ఈ పరిస్థితుల్లో మాగంటి బాబు.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టచ్‌లో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆయన కోసం- ఇటీవలే వైఎస్ఆర్సీపీలో చేరిన ప్రముఖ కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మంతనాలు సాగిస్తోన్నారని అంటున్నారు. మాగంటి బాబు పెట్టిన షరతులకు వైసీపీ నాయకులు అంగీకరిస్తే ఆ పార్టీ కండువా కప్పుకోవడం లాంఛనప్రాయమే అవుతుందని తెలుస్తోంది. ఈ సమాచారాన్ని అటు టీడీపీ గానీ, ఇటు వైసీపీ గానీ ధృవీకరించట్లేదు.
గతంలో మాగంటి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పని చేసిన విషయం తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలోనూ సభ్యుడు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఏలూరు నుంచి లోక్‌సభకూ ఎన్నికయ్యారు. 1998లో కూడా కాంగ్రెస్ తరఫున ఏలూరు లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు.












Click it and Unblock the Notifications