వైసీపీలోకి ఉండవల్లి ? తేల్చేసిన మాజీ ఎంపీ..!
ఒకప్పుడు మాజీ సీఎం దివంగత వైఎస్సార్ కు సన్నిహితుడిగా మెలిగిన రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే గతంలో జగన్ కూ, చంద్రబాబుకు మద్దతుగా పలు సందర్భాల్లో ఆయన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో వైఎస్ జగన్ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తగులుతున్న ఎదురుదెబ్బల నేపథ్యంలో జగన్ 2.0ను చూస్తారంటూ వెల్లడించారు. దీంతో జగన్ 2.0 లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఉంటారనే ప్రచారం మొదలైంది.
దీనిపై ఉండవల్లి అరుణ్ కుమార్ ఇవాళ క్లారిటీ ఇచ్చేశారు. రాష్ట్ర విభజన చట్టంపై పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలని కోరుతూ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన ఆయన.. వైసీపీలో తన చేరికపైనా స్పష్టత ఇచ్చారు. రాజకీయాలనుంచి కావాలనే తాను రిటైర్మెంట్ తీసుకున్నానని ఉండవల్లి వెల్లడించారు. తాను ఏ పార్టీలోకి వెళ్ళనని, తనకు అంత ఓపిక కూడా లేదని తెలిపారు. ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని ఉండవల్లి తేల్చిచెప్పేశారు. దీంతో ఉండవల్లి వైసీపీలో చేరుతున్నారనే ప్రచారానికి చెక్ పడినట్లయింది.

వాస్తవానికి ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయాలకు దూరమయ్యాక చాలా మంది రాజకీయ నేతల్ని కలుస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే విపక్షంలో ఉండగానే పవన్ కళ్యాణ్ తో కలిసి ఏపీ విభజన అంశాలపై కేంద్రం నుంచి సాధించుకోవాల్సిన హామీలపై చర్చలు జరిపారు. అయితే జగన్, చంద్రబాబు విషయంలో మాత్రం ఉండవల్లి పలు స్టాండ్స్ మార్చారు. కానీ తాజాగా జగన్ గతంలో తన తండ్రితో కలిసి పనిచేసిన నేతలతో సంప్రదింపులు జరిపి వారిని పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఉండవల్లి కూడా ఉన్నారనే ప్రచారం ముమ్మరంగా జరిగింది. అయితే ఇవాళ ఉండవల్లి మాత్రం తాను ఏ పార్టీలో చేరడం లేదని చెప్పేయడంతో జగన్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.












Click it and Unblock the Notifications