పవన్ సృష్టించింది అదే..? పోలవరం లెక్కలు తేల్చండి- జగన్ సర్కార్ ను కోరిన ఉండవల్లి..
ఏపీ రాజకీయాలపై, మార్గదర్శి సమస్యపై ఎప్పుడూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇవాళ మరోసారి స్పందించారు. ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న చర్చపై స్పందించిన ఆయన..పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు తర్వాత తాను పెద్దగా దృష్టి పెట్టలేదని తెలిపారు. పవన్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో తెలియదు కానీ ఒక కన్ఫ్యూజన్ సృష్టించారని తెలిపారు.
మార్గదర్శి విషయంలో తాను చెప్పినవన్నీ నిజాలు అని వారే ఒప్పుకున్నారని ఉండవల్లి తెలిపారు. మార్గదర్శి చిట్ ఫండ్ నిబంధనలు పాటించదన్నారు. రాష్ట్రంలో వైసీపీ తప్ప అన్ని పార్టీలు రామోజీకి సపోర్ట్ చేసాయన్నారు. తాను 15 ఏళ్ల క్రితం మార్గదర్శి విషయంలో చేసిన ఆరోపణలు నిజం అయ్యాయన్నారు. అలాగే పోలవరం డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ లో బాధ్యుల్ని ప్రభుత్వం గుర్తించాలని ఉండవల్లి కోరారు. పోలవరం ప్రస్తుత పరిస్థితిపై శ్వేతపత్రం ప్రకటించాలన్నారు.

ఆర్ధిక అసమానతలు పోగొట్టడంపై రాజకీయ పార్టీలు ప్రధానంగా దృష్టి పెట్టాలని ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న ఉమ్మడి పౌరస్మృతిపై వైసీపీ, టీడీపీ , జనసేన శ్వేతపత్రం ప్రకటించాలని ఆయన కోరారు. బీజేపీ తో కలిసి ఉన్నంత మాత్రాన గుడ్డిగా బీజేపీకి మద్దతు ఇవ్వబోమని పవన్ చెప్పారని గుర్తుచేశారు. అందుకే జనసేన ను కూడా శ్వేతపత్రం అడుగుతున్నట్లు ఉండవల్లి తెలిపారు.
దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు మామూలు విషయం కాదని ఉండవల్లి తెలిపారు. చాలా కులాల్లో విడాకులు కుల పెద్దలు ఇచ్చేస్తారన్నారు. ఏపీలో ఉన్న అన్ని కులాలకే ఒకే కోడ్ తేలేమని గుర్తుచేశారు. అలాంటిది యూనిఫామ్ సివిల్ కోడ్ సాధ్యం అవుతుందా అని ప్రశ్నించారు. ఐపీసీ అన్ని మతాలకు ఒక్కటేనని, ఎక్కడ పేదరికం ఉందో అక్కడ జనాభా ఎక్కువ ఉందని ఉండవల్లి తెలిపారు.
ముస్లిం జనాభా ఎక్కువని అనవసర ప్రచారం జరుగుతోందని, యూనిఫామ్ సివిల్ కోడ్ ను ముట్టుకోవద్దు అని లా కమిషన్ చెప్పిందని ఉండవల్లి గుర్తుచేశారు. ఈ ఏడాది 22వ లా కమిషన్ మళ్ళీ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. ఉమ్మడి పౌరస్మృతి బీజేపీ ఎజెండాలో ఉంది కానీ బీజేపీ ప్రారంభించింది కాదన్నారు. రాజ్యాంగంలోనే ఉమ్మడి పౌరస్మృతి గురించి ఉందన్నారు. ఆర్ధిక అసమానతలు తొలగిపోయే విధంగా వెళ్లాలని రాజ్యాంగంలో ఉందన్నారు. ఎవరు ఏ పని చేసినా సరైన వేతనం, చదువుకునే పరిస్థితి ఉండేలా ఉండాలని రాజ్యాంగం చెబుతోందన్నారు.
మరోవైపు కేంద్రం చేసిన అప్పులు లక్షల కోట్లలో ఉన్నాయని ఉండవల్లి తెలిపారు. అసలు కేంద్రాన్ని విమర్శించే పరిస్థితి ఏ పార్టీకి లేదన్నారు. మనకున్న అష్ట దరిద్రాలకు కారణం కేంద్రమే అన్నారు. రాష్ట్ర విభజన విషయం షోరూమ్ పంచుకోవడం లాంటిదే అన్నారు.షో రూమ్ తెలంగాణకు వెనక గోడౌన్ మనకు వచ్చిందన్నారు. ఇంత పకడ్బందీగా ఉన్న వ్యవస్థలో ఇన్ని లోపాలు ఎందుకు వస్తున్నాయని ఉండవల్లి ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications