నందమూరికి కుటుంబానికి దగ్గరగా సాయిరెడ్డి
Vijayasai Reddy: నేడు.. నందమూరి తారకరత్న తృతీయ వర్ధంతి. 2023 ఫిబ్రవరి 18వ తేదీన ఆయన బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు ఆయనకు నివాళి అర్పించారు. ఆయనను స్మరించుకున్నారు.
నందమూరి కుటుంబానికి దగ్గరి బంధువైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి సైతం తారకరత్నకు నివాళి అర్పించారు. తారకరత్న, ఆయన కుటుంబంతో తనకు చిరకాలంగా ఉన్న అనుబంధాన్ని, బంధుత్వాన్ని గుర్తు చేసుకున్నారు.

తారకరత్న ఎప్పుడూ ఉత్సాహంతో ఉండేవాడని, అందరితోనూ స్నేహం, ప్రేమపూరకంగా ఉండేవాడని విజయసాయి రెడ్డి అన్నారు. అలాంటి స్వభావమే ఆయనను చిరస్మరణీయుడిని చేసిందని పేర్కొన్నారు. ఓ ప్రతిభావంతుడైన నటుడు మాత్రమే కాదు, అపురూపమైన మానవత్వం ఆయన సొంతమని నివాళి అర్పించారు.
చిన్న వయస్సులోనే తారకరత్నను కోల్పోవడం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానంటూ తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు సాయిరెడ్డి. 2023 జనవరి 27వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పంలో తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే.
ఆయనను హుటాహుటిన బెంగళూరు నారాయణ హృదయాలయాకు తరలించారు. ఐసీయూలో దాదాపు 20 రోజుల పాటు అత్యాధునిక చికిత్సను అందించినప్పటికీ ప్రాణాలను నిలపలేకపోయారు డాక్టర్లు. సుదీర్ఘకాలం పాటు వెంటిలేటర్‌పై ఉన్నారాయన. గుండెపోటు, శ్వాస తీసుకోలేకపోవడం వల్ల మెదడు సంబంధిత ఇబ్బందులు సైతం తలెత్తాయి.
ప్రముఖ నటులు, తారకరత్న సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, శాండల్ వుడ్ సూపర్ స్టార్ నటుడు శివరాజ్ కుమార్, మంచు మనోజ్.. తదితరులు బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిని సందర్శించారు అప్పట్లో.












Click it and Unblock the Notifications