K.P.Reddaiah : వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారధి తండ్రి కేపీ రెడ్డయ్య మృతి- సీఎం జగన్ నివాళి
మచిలీపట్నం మాజీ ఎంపీ, ఉయ్యూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ప్రస్తుత పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి తండ్రి కొలుసు పెద రెడ్డయ్య యాదవ్ ఇవాళ అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో కొలుసు కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సుదీర్ధ రాజకీయ ప్రస్ధానం కలిగిన కేపీ రెడ్డయ్య వారసుడిగా పార్ధసారధి రాజకీయాల్లో ఉన్నారు.
కృష్ణాజిల్లా కరకంపాడులో జన్మించిన కేపీ రెడ్డయ్య యాదవ్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. తొలుత ఉయ్యూరు నియోజవర్గం నుంచి 1983లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన కేపీ రెడ్డయ్య.. అనంతరం పలు అసెంబ్లీ కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు. అనంతరం 1991లో టీడీపీ టికెట్ పైనే బందరు పార్లమెంటు స్ధానం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు.

ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి పీసీసీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. 1985 నుంచి 91 వరకూ అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడిగా కూడా కేపీ రెడ్డయ్య పనిచేశారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పెనమలూరు ఎమ్మెల్యే పార్ధసారధి మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు.

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కేపీ రెడ్డయ్య కొంతకాలంగా విజయవాడలోని ఇంటికే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం విషమించడంతో ఇవాళ కన్నుమూసినట్లు తెలుస్తోంది. కేపీ రెడ్డయ్య మృతికి పలువురు సంతాపాలు తెలిపారు. సీఎం జగన్ తో పాటు మంత్రులు కారుమూరి నాగేశ్వరారు, జోగి రమేష్, పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications