పవన్ మాటే నిజమైంది-ఎమ్మెల్సీ ఫలితాలపై గంటా శ్రీనివాస్ కామెంట్స్..
ఏపీలో వెలువడుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార వైసీపీకి షాక్ ఇస్తుండటంతో టీడీపీ నేతలు ఇప్పుడు వాటిని విశ్లేషించే పనిలో ఉన్నారు.
విశాఖపట్నం : ఏపీలో తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Graduate Mlc Election ) రెండు సీట్లలో టీడీపీ ఆధిక్యం కొనసాగుతోంది. మూడో స్ధానంలో వైసీపీ అభ్యర్ధి స్వల్ప ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో విపక్ష టీడీపీ నేతలు ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ (TDP) ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కూడా ఫలితాల సరళిపై స్పందించారు.
ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ లో టీడీపీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఓట్ల లెక్కింపు జరుగుతున్న స్వర్ణభారతి స్టేడియానికి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivas Rao) వచ్చారు. ఫలితాల సరళి పరిశీలించిన గంటా.. ఎన్నికలు జరిగిన తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) మాట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజమైందని గంటా తెలిపారు. చతుర్ముఖ పోటీ కొనసాగినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడా చీలిపోలేదని గంటా గుర్తుచేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపదెబ్బ, గుణపాఠమని టీడీపీ ఎమ్మెల్యే గంటా విశ్లేషించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు రాష్ట్రం అంతా కనిపించిందన్నారు. రాయలసీమ లో కూడా సత్తా చాటుతుందటం టీడీపీ హవాకు సంకేతమన్నారు. మూడేళ్ల క్రితం 50శాతం పైగా ఓటింగ్ సాధించిన వైసీపీ ఇప్పుడు 30శాతంకు పడిపోయిందన్నారు. ఈ ఒరవడి వచ్చే ఎన్నికలకు నాంది పలుకుతుందన్నారు. 2024లో టీడీపీదే విజయమన్నారు. రాజధాని సహా వైసీపీ (YSRCP) చెప్పిన మాటలకు ప్రజల విశ్వాసం లభించలేదని గంటా శ్రీనివాస్ విశ్లేషించారు.












Click it and Unblock the Notifications