వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
YSRCP Manifesto 2024: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు కౌంట్ డౌన్ ఆరంభమైంది.. గడువు సమీపించింది. ఎన్నికలకు ఎంతో సమయం లేదు. ఇంకో ఎనిమిది రోజులు మాత్రమే వ్యవధి ఉంది. ఈ నెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.
పోలింగ్ గడువు దగ్గర పడుతోండటం అన్ని పార్టీలు కూడా జనంలోకి చొచ్చుకెళ్తోన్నాయి. ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాయి. 2019 నాటి ఎన్నికల్లో సాధించిన పట్టును నిలుపుకోవడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను రూపొందించుకుంది. అప్పటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే.

వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం చివరి విడత ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోన్నారు. ఒకే రోజు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ రోడ్ షోలను చేపడుతోన్నారు. శనివారం నాడు శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా హిందూపురం, చిత్తూరు జిల్లా పలమనేరు, నెల్లూరు సిటీలో రోడ్ షోల్లో ప్రసంగించారు వైఎస్ జగన్.
ఈ సందర్భంగా పలమనేరుకు చెందిన టీడీపీ మాజీ శాసనసభ్యురాలు ఎల్ లలిత కుమారి సైతం వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొన్నారు. పలమనేరుకు వచ్చిన సందర్భంగా ఆమె జగన్‌ను కలిశారు. ఆయన సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కండువా కప్పి ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు జగన్.
2004 నాటి ఎన్నికల్లో ఎల్ లలిత కుమారి టీడీపీ అభ్యర్థిగా పలమనేరు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పట్లో టీడీపీ తరఫున గెలిచిన అతి కొద్దిమంది ఎమ్మెల్యేల్లో ఆమే ఒకరు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభంజనాన్ని సైతం తట్టుకుని ఆమె విజయం సాధించగలిగారు.
2009 నాటి ఎన్నికల్లో లలిత కుమారికి టికెట్ లభించలేదు. ఈ స్థానంలో మాజీ మంత్రి ఎన్ అమర్‌నాథ్ రెడ్డి నిలబెట్టారు.. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. 2009లో ఆయనే గెలిచారిక్కడ. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో అమర్‌నాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నెగ్గారు. మళ్లీ ఆయన సొంతగూటికి చేరారు. 2019లో ఓడిపోయారు.
ఈ ఎన్నికల్లో కూడా అమర్‌నాథ్ రెడ్డికే టికెట్ లభించింది. తన సమీప ప్రత్యర్థి, వైఎస్ఆర్సీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్ వెంకటే గౌడతో తలపడుతున్నారు. ఈ పరిణామాల మధ్య పలమనేరుకే చెందిన మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి పార్టీని వీడటం, వైసీపీలో చేరటం.. టీడీపీకి ప్రతికూలంగా మారినట్టయింది.












Click it and Unblock the Notifications