దక్షిణ తీరాన కదిలిన సముద్ర గర్భం- రాకాసి అలలు, సునామీ హెచ్చరికలు జారీ
Japan earthquake: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఆ దేశ దక్షిణ ప్రాంతాన్ని వణికించింది. భూకంప తీవ్రత అనూహ్యంగా ఉండటంతో స్థానిక అధికారులు తీర ప్రాంతాలన్నింటినీ ఖాళీ చేయించారు. బీచ్ లను తాత్కాలికంగా మూసివేశారు. ప్రకంపనల తీవ్రత పలు ప్రాంతాలపై పడింది. కొన్ని చోట్ల భవనాలు బీటలు వారాయి. పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు.
ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.1గా రికార్డయింది. జపాన్ ఈశాన్య ప్రాంతంలోని కుమామొటొ ప్రీఫెక్షర్ లోని క్యుషు ఐలండ్ లో ఆ దేశ కాలమానం ప్రకారం సాయంత్రం 4:27 నిమిషాలకు భూమి ప్రకోపించింది. రాజధాని టోక్యోకు దక్షిణ దిశగా 1,184 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ కుమామొటొ సిటీ. ఈ నగరానికి 32 కిలోమీటర్ల దూరంలో గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది.

ఉపరితలం నుంచి 24 కిలోమీటర్ల దిగువన టెక్టోనిక్ ప్లేట్లల్లో సంభవించిన పెను కదలికల వల్ల భూమి ప్రకోపించింది. జనం వెంటనే రోడ్ల మీదికి పరుగెత్తారు. ఇళ్లు, ఆఫీసులు, ఇతర నివాసాలను ఖాళీ చేశారు. భూకంప ప్రభావం సమీప ప్రాంతాలపై పడింది. పలు భవనాలు దెబ్బతిన్నాయి. బీటలు వారాయి. తీర ప్రాంతం కావడం వల్ల సముద్రం అల్లకల్లోలానికి గురైంది. సునామీ హెచ్చరికలు సైతం జారీ అయ్యాయంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రధాన భూకంపం తర్వాత కూడా తేలికపాటి ప్రకంపనలు నమోదవుతోండటంతో జనం తమ నివాసాల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. తీవ్ర భూకంప ప్రభావం దృష్ట్యా తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను తక్షణమే సురక్షిత, ఎత్తైన ప్రదేశాలకు తరలిపోవాలని స్థానిక యంత్రాంగం సూచించింది. ఈ ప్రకంపనల ధాటికి కుమమోటోతో పాటు క్యూషు ద్వీపంలోని నాగసాకి, కాగోషిమా, ఫుకుఓకా, సాగా, ఓయితా, మియాజాకి వంటి కీలక ప్రావిన్సుల్లో ప్రభుత్వం అత్యవసర హెచ్చరికలను జారీ చేసింది.
తీరంలో రెండు మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉన్నట్లు జపాన్ మెటెరొలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది. తీర ప్రాంత మొత్తం కూడా ఖాళీ చేయాలని ఆదేశించింది. జపాన్.. భూగోళికంగా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో క్రియాశీలక అగ్నిపర్వత జోన్‌లో ఉంటోం. ప్రపంచంలోనే అత్యధిక భూకంప నెట్‌వర్క్‌లో ఉన్నందున ప్రకంపనలు సర్వసాధారణం. మూడు లేదా అంతకంటే తక్కువ తీవ్రతతో భూమి తరచూ ప్రకంపిస్తుంటుందక్కడ.
తాజాగా ఏడుకు పైగా తీవ్రతతో భూమి కంపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. జపాన్‌లో భూకంప తీవ్రతను లెక్కించడానికి షిండో స్కేల్‌ను ఉపయోగిస్తారు. ఇది అమెరికాలో ఉపయోగించే మోడిఫైడ్ మెర్కల్లీ ఇంటెన్సిటీ స్కేల్. భూకంపం విడుదల చేసే మాగ్నిట్యూడ్ ను రిక్టర్ స్కేల్ కొలుస్తుంది. షిండో స్కేల్ ప్రకారం.. నాలుగు లేదా అంతకంటే తక్కువ తీవ్రత ఉన్న భూకంపాలను తేలికపాటివిగా పరిగణిస్తారు. అయిదు లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న ప్రకంపనలు తీవ్రమైనవిగా భావిస్తారు.












Click it and Unblock the Notifications