జగన్ కారు ఎక్కమంటే ఎక్కా ..! నాకేం తెలియదన్న పేర్ని నాని...!
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. వైఎస్ జగన్ పర్యటనలకు ప్రభుత్వం ఎక్కడికక్కడ ఆటంకాలు కల్పిస్తోందని, భద్రత ఇవ్వడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే.. పోలీసులు మాత్రం నిబంధనల్ని ఉల్లంఘించి ఈ టూర్లు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. దీంతో ఎవరి వాదన వాస్తవమూ కూడా తెలియని పరిస్ధితి. ఈ నేపథ్యంలో గత నెలలో వైఎస్ జగన్ సత్తెనపల్లి టూర్ లో చోటు చేసుకున్న పరిణామాలు కలకలం రేపాయి.
జూన్ 18న సత్తెనపల్లి పట్టణంలో వైఎస్ జగన్ ర్యాలీగా వెళ్లడం, ట్రాఫిక్ ఇబ్బందులు, రప్పా రప్పా అనే ప్లకార్డ్ ను ఓ కార్యకర్త ప్రదర్శించడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆ రోజు అక్కడే ఉన్న వైసీపీ మాజీ మంత్రి పేర్నినానిని పోలీసులు విచారణకు పిలిచారు. ఈ సందర్భంగా విచారణకు హాజరైన పేర్ని నాని.. ఆసక్తికర విషయం ఒకటి చెప్పారు. ఫైనల్ గా ఆ రోజు జరిగిన పరిణామాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాత్రం తేల్చేశారు.

జగన్ సత్తెనపల్లిలో చేసిన ర్యాలీలో భారీగా జన సమీకరణ, డీజే డ్యాన్సులు, వాహనాల భారీ శబ్దాలు, అనుమతుల్లేకుండా ఇవన్నీ చేయడం వంటి వాటిపై పోలీసులు పేర్నినానిని గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. దీంతో పేర్ని నాని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద ఆయన కారు ఎక్కమంటే ఎక్కానని, సత్తెనపల్లి టూర్ తర్వాత తిరిగి కారులోనే వెళ్లిపోయానని ఆ రోజు చోటు చేసుకున్న ఇతర పరిణామాలు, అనుమతులపై తనకు ఏమీ తెలియదని పేర్ని నాని తేల్చిచెప్పేశారు.
జగన్ సత్తెనపల్లి టూర్ సందర్భంగా తాను ఆ కారులోనే ఉన్నానని పేర్ని నాని పోలీసులకు చెప్పారు. అయితే ర్యాలీలో మాత్రం పాల్గొనలేదని తెలిపారు. అలాగే తనకు రెంటపాళ్లే కాదు సత్తెనపల్లి కూడా తెలియదంటూ పోలీసులకు పేర్నినాని చెప్పారు. సత్తెనపల్లిలో ర్యాలీ, ఇతర ఘటనలతోనే కాదు అక్కడ వైసీపీ ఇన్ చార్జ్ కూడా ఎవరో తెలియదంటూ పోలీసుల విచారణ తరువాత బయటికి వచ్చిన పేర్ని నాని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications