జగన్ ఇంటి ముందు ధర్నా? పేర్నినాని సంచలన వార్నింగ్..?
ఏపీలో వైసీపీ మాజీ మంత్రి, బందరు ఎమ్మెల్యే పేర్నినానికి మిస్టర్ కూల్ గా పేరుంది. ప్రెస్ మీట్లలోనూ, బయట కూడా ప్రత్యర్ధులపై విమర్శలు చేసే విషయంలోనూ, వైసీపీ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే విషయంలోనూ పేర్ని తనదైన శైలిలో కూల్ గా వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే అలాంటి పేర్నినానికి ఇవాళ ఎక్కడ లేని కోపమొచ్చింది. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసిన పేర్నినాని ఏకంగా సీఎం జగన్ ఇంటిముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు.
ఇంతకీ అసలేం జరిగిందంటే.. ఉమ్మడి కృష్ణాజిల్లా జడ్పీ సమావేశం జరుగుతోంది. దీనికి ఏలూరు జిల్లా కలెక్టర్ కానీ, ఇతర అధికారులు కానీ హాజరు కాలేదు. దీంతో పేర్నినానికి ఎక్కడ లేని కోపమొచ్చింది. అధికారులు జడ్పీ సమావేశానికి హాజరుకాకపోవడంతో ముఖ్యమైన అభివృద్ధి పనులపై నిర్ణయాలు తీసుకోలేకపోతున్నట్లు, ప్రతిపక్షాలకు సమాధానం చెప్పే విషయంలో ఇబ్బందులు ఎదురువుతున్నట్లు భావించిన పేర్ని కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జడ్పీ సమావేశాలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు కానీ, ఆ జిల్లా కలెక్టర్ గాని ఒక్కసారి కూడా హాజరు కాకపోవడంపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే సమావేశాలకు వారు రాకపోతే జడ్పీటీసీలతో కలిసి సీఎం ఇంటి ముందు లేకపోతే, సీఎస్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతామని ఆయనకు లేఖ రాయాలని చైర్ పర్సన్ ఉప్పాల హారికకు సూచించారు. దీంతో జడ్పీ హాలులో ఒక్కసారిగా అంతా షాకయ్యారు.
జిల్లాల విభజన తర్వాత కలెక్టర్లపై ఒత్తిడి పెరిగింది. దీంతో జడ్పీ సమావేశాలకు వారు హాజరయ్యే తీరికలేకుండా పోతోంది. అయితే ఉమ్మడి కృష్ణాజిల్లా జడ్పీలో భాగంగా ఉన్న ఏలూరు జిల్లా కలెక్టర్, ఇతర సిబ్బంది హాజరుకాకపోవడంతో వాటిపై అధికార పక్షం డిఫెన్స్ లో పడుతోంది. గతంలోనూ పలుమార్లు ఇలాగే జరిగింది. దీంతో ఇవాళ పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే సమావేశానికి కలెక్టర్ హాజరుకాకపోతే ఏం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది.












Click it and Unblock the Notifications