టీడీపీలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే: స్వాగత బ్యానర్లు కూడా రెడీ
Meda Mallikarjuna Reddy: రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఆ పార్టీలో కీలక నేతలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు అప్పుడే మొదలయ్యాయి.
మొన్నటి ఎన్నికల్లో అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీకి దక్కింది.. 11 స్థానాలే. కంచుకోటల్లాంటి నియోజకవర్గాలను వైఎస్ఆర్సీపీ కోల్పోయింది. అటు లోక్‌సభలోనూ పరాభవమే ఎదురైంది. నాలుగు స్థానాలకే పరిమితమైంది.

దీని తరువాత రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైఎస్ఆర్సీపీ క్రమంగా వలసల బెడదను ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి చెందిన కొందరు బలమైన నాయకుల చూపు తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమిపై పడింది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన, టికెట్ దక్కని నాయకులు, అసంతృప్తులు పార్టీ ఫిరాయించడానికి ఏర్పాట్లు చేసుకుంటోన్నారు.
ఈ క్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు తెర మీదికి వచ్చినట్లు తెలుస్తోంది. జనసేనలో చేరొచ్చనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఆయన మంతనాలు ప్రారంభించారనీ అంటున్నారు.
ఇప్పుడు తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీని వీడటం దాదాపుగా ఖాయమైంది. ఆయనే- మేడా మల్లికార్జునరెడ్డి. మాజీ ఎమ్మెల్యే. 2019-2024 మధ్యకాలంలో అన్నమయ్య రాయచోటి జిల్లాలోని రాజంపేటకు ప్రాతినిథ్యాన్ని వహించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్ లభించలేదు. 2014 నాటి ఎన్నికల్లో టీడీపీ నుంచే విజయం సాధించారాయన.

వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. విజయం సాధించారు. తనకు టికెట్ లభించకపోవడం వల్ల అసంతృప్తిగా ఉంటోన్నారాయన. పార్టీ కార్యకలాపాలకూ దూరంగా ఉంటూ వస్తోన్నారు. ఇక కూటమి విజయం సాధించిన నేపథ్యంలో అందులో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలను తెలియజేస్తూ రాజంపేటలో పెద్ద ఎత్తున బ్యానర్లను కట్టించారు మేడా మల్లికార్జున రెడ్డి. ఆయన సోదరుడు మేడా రఘునాథరెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2030 వరకు ఆయన పదవీ కాలం ఉంది.












Click it and Unblock the Notifications