తమిళనాడులో ఏపీ వాసులు నలుగురు మృతి.. హోం మంత్రి కీలక ఆదేశాలు !!
వరుసగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలకు తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి. అయ్యప్ప భక్తులు శబరిమల తిరిగి వస్తుండగా చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఏకంగా నలుగురు మృతిచెందిన ఘటన తమిళనాడులో ఈరోజు ( డిసెంబర్ 6, 2025 ) ఉదయం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మొత్తం నలుగురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరంతా ఏపీకి చెందిన వారు కావడం మరింత విషాదం నింపుతోంది.
అసలేం జరిగిందంటే..?
అయ్యప్ప భక్తులు శబరిమల నుంచి రామేశ్వరం వెళ్తుండగా రామనాథపురం వద్ద తమ కారును రోడ్డు పక్కన ఆపి నిద్రిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ లారీ అతివేగంతో వచ్చి కారును ఢీకొట్టింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురిని ఏపీలోని విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస వాసులుగా.. మరొకరిని గజపతినగరం మండలం మరుపల్లి వాసిగా గుర్తించారు.

కాగా విషయం తెలుసుకున్న ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఈ విషాద వార్తపై స్పందించారు. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న తరుణంలో విజయనగరం వాసులు మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో నలుగురు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. అలానే అధికారులను అడిగి ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను మంత్రి తెలుసుకున్నారు. మృతదేహాలను త్వరితగతిన కుటుంబ సభ్యులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
మృతుల వివరాలు..
దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస వాసులు :
వంగర రామకృష్ణ (51)
మార్పిన అప్పల నాయుడు (33)
కొత్తవలసవాసి మరాడ రాము (50)
గజపతినగరం మండలం మరుపల్లి వాసి :
బండారు చంద్రారావు
ఈ విషాద వార్తతో వారి కుటుంబాల్లోనే కాకుండా స్థానికంగా రోదనలు మిన్నంటాయి. దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న తరుణంలో ఇలా కానరాని లోకాలకు వెళ్లడం పట్ల కన్నీటి పర్యంతం అవుతున్నారు.












Click it and Unblock the Notifications