శబరిమలైలో నలుగురు మహిళలు గల్లంతు: క్షేమం
కర్నూలు: శబరిమలై క్షేత్రంలో మణికంఠుడిని దర్శించుకోడానికి కర్నూలు జిల్లా ఆదోని రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన నలుగురు వృద్ధ మహిళల ఆచూకీ గల్లంతైంది. పది రోజులు దాటినా వారు ఎక్కడ ఉన్నదీ, ఎలా ఉన్నదీ సమాచారం తెలియడం లేదు. వీరిలో ముగ్గురిది ఆదోని మండలం చిన్నగోనేహాల్, ఒకరిది ఎమ్మిగనూరు పట్టణం లక్ష్మీపేట. వారి వద్ద ఉన్న ఫోన్ పనిచేయడం లేదు. దీంతో వారి కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.

ఆదివారం ఆదోని ఇస్వీ పోలీస్ స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేశారు. ఆదోని మండలం చిన్నగోనేహాల్ గ్రామానికి చెందిన రత్నమ్మ (65), చెన్నమ్మ(61), లక్ష్మమ్మ(60), ఎమ్మిగనూరు పట్టణం లక్ష్మీపేటకు చెందిన నర్సమ్మ(66) డిసెంబర్ 26వ తేదీన కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం ఆదోని రైల్వే స్టేషన్‌లో ఉదయం 9.30 గంటలకు కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ బయలుదేరారు. వారి వద్ద 07093789775 నంబరు గల సెల్ ఉంది.
వారు బయలుదేరిన రోజు గుంతకల్లు రైల్వే స్టేషన్ దాటామని రత్నమ్మ తన కుమారుడు వెంకటేశులుకు ఈ సెల్ నుంచి సమాచారం ఇచ్చారు. రత్నమ్మ శబరి యాత్ర చేయడం ఇది నాలుగోసారి. ఐదారు రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా నేటికీ రాకపోవడం, సెల్‌ఫోన్ పని చేయకపోవడంతో రత్నమ్మ కుమారుడు వెంకటేశులు, లక్ష్మమ్మ కుమారుడు శివప్రసాద్, అనంతపురంలో టీచర్‌గా పని చేస్తున్న నర్సమ్మ కొడుకు ఈరన్న ఆదోని ఇస్వీ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ నరేష్‌కు ఆదివారం ఫిర్యాదు చేశారు. వారు రైల్వే స్టేషన్ నుంచి వెళ్లారు కాబట్టి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు వారికి సూచించారు. గల్లంతైన మహిళలు క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందింది. వారు సోమవారం ఉదయం కర్నూలు జిల్లాలోని తమ స్వస్థలాలకు చేరుకున్నారు.












Click it and Unblock the Notifications