జగన్ యాత్ర, అనంతలో హైటెన్షన్ పాలిటిక్స్ : వైసీపీ వర్సెస్ టీడీపీ
అనంతపురం : అధికార ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు ఓవైపు.. ఎక్కడ ఘర్షణలు చోటు చేసుకుంటాయోనని ముందే మోహరించిన పోలీసులు మరోవైపు.. అనంతపురంలో జగన్ రైతు భరోసా యాత్ర ఉద్రిక్తలకు దారి తీస్తున్న నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న పరిస్థితి ఇది.
గురువారం యాత్రలో భాగంగా పెద్దవడుగూరులో మీడియాతో మాట్లాడిన వైసీపీ అధినేత జగన్ సీఎం చంద్రబాబును చెప్పుతో కొట్టండంటూ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డంతో జిల్లాలోని టీడీపీ శ్రేణులు జగన్ యాత్రను అడ్డుకోవాలని భావించారు. దీనికి తగ్గట్టే పెనుగొండ ఎమ్యెల్యే పార్థసారథి శుక్రవారం ఉదయం జగన్ యాత్రను ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని ప్రకటించడంతో జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

కాగా, జగన్ యాత్రలకు అడ్డుపడాలని చూస్తే సహించేది లేదని వైసీపీ నేతలు కూడా ప్రతిఘటించడంతో, యాత్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుందేమోనన్న అనుమానాలకు తావిచ్చింది. టీడీపీ శ్రేణుల నుంచి జగన్ యాత్రలకు అడ్డంకులు ఏర్పడే అవకాశం నేపథ్యంలో జగన్ యాత్రకు భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.

ఇదిలా ఉంటే నేటి ఉదయం యాడికిలో జరుగుతున్న జగన్ యాత్రకు వైసీపీ శ్రేణుల కంటే ముందే టీడీపీ కార్యకర్తలు యాత్రాస్థలికి చేరుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు టీడీపీ శ్రేణులను నిలువరించి, అక్కడి నుంచి వెనక్కి పంపేలా చేశాయి. అనంతరం అక్కడికి చేరుకున్న వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జగన్ కు మద్దతుగా నినాదాలు చేశారు.
మొత్తానికి పోలీసు పహారా మధ్య జగన్ యాత్రలు కొనసాగుతున్నాయి. టీడీపీ శ్రేణులను నిలువరించేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది పోలీసు యంత్రాంగం.












Click it and Unblock the Notifications