సీఎం జగన్ కొత్త వరాలు -పెన్షన్ రూ 4 వేలు, రుణమాఫీ: గేమ్ ఛేంజర్..!!
ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటనకు సిద్దమవుతున్నారు. ఏపీలో తన సంక్షేమం - సామాజిక న్యాయం మరోసారి అధికారం అందిస్తుందని జగన్ ధీమాతో ఉన్నారు. ఇటు పార్టీ అభ్యర్దుల విషయంలో గెలుపే ప్రామాణికంగా..సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరో వైపు పాలనా పరంగా కీలక అడుగులు వేస్తున్నారు. అటు ఎన్నికల వేళ మరిన్ని జనాకర్షక సంక్షేమ పథకాల ప్రకటనకు సిద్దమయ్యారు.
జగన్ కొత్త హామీల దిశగా : ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వేళ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఏ విషయంలోనూ అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చటం ద్వారా తన విశ్వసనీయత పెంచుకొనే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. జగన్ ఓటమే లక్ష్యంగా జత కట్టిన చంద్రబాబు, పవన్ ఎన్నికల మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ సంక్షేమం పైన హామీలు ప్రకటించింది. కానీ, ఆశించిన స్థాయిలో ఆ పథకాలకు ప్రచారం..ఆదరణ కనిపించ లేదు. చంద్రబాబు ఏం చెప్పినా అమలు చేయరని..ఎన్నికల్లో మోసం చేసే హామీలు ఇస్తారని జగన్ ప్రతీ సభలోనూ ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో కొత్త నిర్ణయాల ప్రకటన దిశగా జగన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

సంక్షేమానికి ప్రాధాన్యత : జగన్ 2019లో తాను అధికారంలోకి వచ్చిన తరువాత అప్పుడు ఉన్న రూ 2వేల పెన్షన్ దశల వారీగా రూ 3 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రతీ ఏటా రూ 250 చొప్పున పెంచుతూ ఈ నెల నుంచి రూ 3వేలు అందిస్తున్నారు. 66 లక్షలకు పైగా అవ్వా, తాతలకు పెన్షన్ అందుతోంది. దీంతో..మరోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రస్తుత పెన్షన్ రూ 4 వేలకు పెంచేలా జగన్ హామీ ఇచ్చేందుకు సిద్దమయ్యారని వైసీపీ నేతల సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. అటు మహిళలకు ఉచిత బస్పు ప్రయాణం పైన ప్రచారం జరుగుతోంది. ఇందులో సాధ్యాసాధ్యాల తో పాటుగా పొరుగు రాష్ట్రంలో ఎదురవుతున్న సమస్యలను..ఆర్దిక భారం పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

మహిళలు - రైతులే లక్ష్యంగా : ఇక, రైతుకు రుణ మాఫీ అంశం పైన పార్టీలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పటికే పలు నిర్ణయాలు అమలు చేస్తోంది. 2019 ఎన్నికల సమయం లో పొదుపు సంఘాల మహిళలకు రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన జగన్ అమలు చేసారు. చివరి విడత చెల్లింపులకు సంబంధించి ముహూర్తం ఖరారు చేసారు. అదే విధంగా రైతులకు రుణమాఫీ అంశంలో ఎంత మేర చేయాలి..ఎంత మేర భారం పడుతుంది..ఎంత మేర చేస్తే ఎంత మందికి ప్రయోజనం కలుగుతుందనే అంశాల పైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధ్యమయ్యే హామీలను ఇవ్వాలనేది జగన్ ఆలోచనగా పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో..ఎన్నికల కదనరంగంలోకి దిగుతున్న సమయంలో సీఎం జగన్ ప్రకటించే నిర్ణయాల పైన ఆసక్తి పెరుగుతోంది.












Click it and Unblock the Notifications