కాసేపట్లో అనుచరులతో యార్లగడ్డ ఫైనల్ భేటీ ! టీడీపీలో చేరిక ప్రకటించే ఛాన్స్ ?
గన్నవరంలో వైసీపీ వర్సెస్ వైసీపీగా సాగుతున్న రాజకీయంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో అమీతుమీ సాగిస్తున్న గత ఎన్నికల అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు... ఇవాళ కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకూ వైసీపీలోనే ఉంటూ వంశీకి బదులుగా మరోసారి తనకే గన్నవరం నుంచి పోటీకి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతూ వచ్చిన యార్ల గడ్డ వెంకట్రావు.. తాజాగా అనుచరులతో కలిసి బలప్రదర్శన కూడా చేశారు. అయినా సజ్జల నో చెప్పేయడంతో తుది నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
ఇవాళ ఉదయం 11 గంటలకు ముఖ్య అనుచరులతో గన్నవరంలోనే యార్లగడ్డ వెంకట్రావు సమావేశం ఏర్పాటు చేశారు.ఇప్పటికే గన్నవరం నుంచే పోటీ చేస్తానని కార్యకర్తల సమావేశంలో ప్రకటించిన యార్లగడ్డ వెంకట్రావు ఆ దిశగా మరో అడుగు వేయబోతున్నారు. తన ప్రకటన తర్వాత స్పందించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్టి.. పార్టీలో ఉండలేని వారు వెళ్లిపోవచ్చంటూ యార్లగడ్డ కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. దీంతో యార్లగడ్డ తన భవిష్యత్తు చూసుకునేందుకు సిద్ధమయ్యారు.

భవిష్యత్ కార్యచరణపై ఇవాళ యార్లగడ్డ నిర్ణయం తీసుకోబోతున్నారు. దీనికి ముందు చివరిగా అనుచరులు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆయన నిర్ణయించారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరికపై స్పష్టమైన ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన అభిమానులు ఈ మేరకు పరోక్షంగా సంకేతాలు ఇచ్చేస్తున్నారు. రేపు కృష్ణాజిల్లాలోకి టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర అడుగుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో 22న గన్నవరం లో నారా లోకేష్ లోకేష్ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇందులో లోకేష్ సమక్షంలో యార్లగడ్డ టీడీపీలో చేరుతారని అనుచరులు చెప్తున్నారు.
మరోవైపు గన్నవరంలో చోటు చేసుకుంటున్నతాజా పరిణామాలపై స్ధానిక ఎమ్మెల్యే, వచ్చే ఎన్నికల వైసీపీ అభ్యర్ధి కూడా అయిన వల్లభనేని వంశీ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఇప్పటికే వంశీ తీరును నిరసిస్తూ నాలుగేళ్లుగా అసంతృప్తిగా ఉన్న యార్లగడ్డ ఈసారి టీడీపీ నుంచి బరిలోకి దిగితే నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఏకపక్షంగా మారుతుందని భావిస్తున్నారు. ఈ పరిణామాలతో వంశీకి ఇబ్బందులు తప్పేలా లేవు. దీంతో అధిష్టానం సూచన మేరకు ఎలాంటి ప్రకటనలు చేయకుండా వంశీ మౌనంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. యార్లగడ్డ టీడీపీలో చేరితే ఆ తర్వాత ఎలాగో వీరిద్దరి మధ్య రాజకీయ పోరు తప్పదు.












Click it and Unblock the Notifications